Reasons for Cars Catching Fire :ప్రస్తుత రోజుల్లో కార్ల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే పెరిగిన కార్ల వినియోగంతో పాటు.. కారు లోపల మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. కొన్నిసార్లు కార్లు రన్నింగ్‌లో ఉండగానే నిప్పంటుకుంటే.. ఇంకొన్నిసార్లు నిలిపి ఉన్న కార్లలోనూ మంటలు అంటుకున్న సందర్భాలు ఉన్నాయి. చూస్తుండగానే మంటలు కారు నిండా వ్యాపించి కళ్ల ముందే కాలిబూడిదైన కార్లు మరెన్నో. దీంతో లక్షలు పోసి కొన్న కారులో హాయిగా ఫ్యామిలీతో ప్రయాణం చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇక ఎండాకాలం వస్తే ఈ పరిస్థితి మరింత అధికం. అసలు, కార్లలో ఆకస్మాత్తుగా మంటలు ఎందుకు వస్తాయి? అందుకు గల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇంజిన్ ఓవర్‌హీట్ : కార్లలో మంటలు చేలరేగడానికి ప్రధాన కారణం.. ఇంజిన్ ఓవర్‌హీట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఎక్కువసేపు ఆపకుండా కారును డ్రైవ్ చేస్తుంటారు. దాంతో ఇంజిన్ ఒక్కోసారి అధికంగా వేడెక్కి మంటలు చెలరేగే అవకాశం ఉంటుందంటున్నారు ఆటో మొబైల్ నిపుణులు. కాబట్టి లాంగ్ జర్నీలు చేసేటప్పుడు మధ్యమధ్యలో విరామాలు తీసుకుంటూ ఇంజిన్ కాస్త చల్లగా అయ్యే వరకూ వెయిట్ చేసి ఆ తర్వాత డ్రైవింగ్ చేయడం మంచిదంటున్నారు.
ఫ్యూయల్ లీకేజీ :ఇది కూడా కారులో మంటలు తలెత్తడానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే వెహికల్లో ఉపయోగించే పెట్రోల్, డీజిల్ వంటి ఫ్యూయల్స్ అతి త్వరగా మంటలను వ్యాపించే లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి కారులో వీటి లీకేజీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇందుకోసం తరచుగా వెహికల్‌ను చెక్ చేస్తుండాలి. ఒకవేళ ఎక్కడైనా చిన్న లీకేజీ కనిపించినా వెంటనే ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ :కారులో ఆకస్మాత్తుగా మంటలు రావడానికి ఇది కూడా ఒక సహజమైన కారణంగా చెప్పుకోవచ్చంటున్నారు ఆటోమొబైల్ నిపుణులు. ఎందుకంటే వెహికల్లోని ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్‌లో ఏదైనా చిన్నపాటి లోపం తలెత్తితే ఆ కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుందంటున్నారు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరమంటున్నారు.
ఈ సంకేతాలు కనిపిస్తే - మీ కారు బ్రేక్స్ ఫెయిల్ కాబోతున్నట్టే!