RBI Monetary Policy June 2024 :కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. అంతా ఊహించినట్లుగానే రెపోరేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది.
వాస్తవానికి 2023 ఏప్రిల్ నుంచి రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగిస్తూ వస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించడం ఇది వరుసగా ఎనిమిదోసారి. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ ప్రకటించిన రెండో ద్వైమాసిక పరపతి విధానం ఇది.
జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం!
ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం ఉండవచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఇది కనుక కార్యరూపం దాల్చితే వరుసగా నాలుగే ఏడాది కూడా 7 శాతానికి పైగా వృద్ధి సాధించినట్లు అవుతుంది. మరోవైపు సీపీఐ ద్రవ్యోల్బణాన్ని ఇరువైపులా 2 శాతం మార్జిన్‌తో 4 శాతం వద్ద ఉండేలా చూడాలని ఆర్బీఐని ప్రభుత్వం ఆదేశించింది.
ఆర్‌బీఐ మోనటరీ పాలసీ నిర్ణయాలు
- ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య మంచి సమతుల్యత కొనసాగుతోందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద ఉంచడానికి ఆర్‌బీఐ కట్టుబడి ఉందని, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుండడం కాస్త ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు.
- 'నైరుతి రుతుపవనాల వల్ల ఖరీఫ్ సీజన్లో పంటల ఉత్పత్తి పెరుగుతుందని ఆశిస్తున్నాం. అలాగే దీని వల్ల రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరుగుతాయని భావిస్తున్నామని' శక్తికాంత దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు
- రిటైల్ ద్రవ్యోల్బణం2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 4.9 శాతం, రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.6 శాతం, నాల్గో త్రైమాసికంలో 4.5 శాతం ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది.
- 'అనుకున్నట్లుగా సకాలంలో మంచి వర్షాలు పడితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉండవచ్చు. ఒకవేళ ఇలా జరగకపోతే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని' ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్నారు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణంలో కొంత మేరకు దిద్దుబాటు జరగవచ్చని శక్తికాంత దాస్ అన్నారు.
దృఢమైన ఆర్థిక పునాదులతో భారత్
- ఇతర కరెన్సీలతో పోల్చితే ఇండియన్ రూపాయి సాపేక్ష స్థిరత్వంతో కొనసాగుతోంది. ఇది మన దేశ బలమైన ఆర్థిక మూలాలకు నిదర్శనంగా ఉందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
- 2024 ఆర్థిక సంవత్సర వార్షిక ఫలితాలు మన దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో సూచిస్తున్నాయి.
- 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యవసర రిస్క్ బఫర్ (నిల్వలను) 0.5 శాతం పెంచడం వల్ల ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్ మరింత మెరుగుపడుతుందని శక్తికాంత దాస్ అన్నారు.