RBI Monetary Policy Meeting 2024 :కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా కొనసాగిస్తూ భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగించాలని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వ సారి.
వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం- రెపోరేటు యథాతథం - RBI MPC 2024
కీలక రేట్లలో ఎలాంటి మార్పూ చేయని ఆర్‌బీఐ - రెపోరేటు 6.5 శాతం
![వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం- రెపోరేటు యథాతథం RBI Monetary Policy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-12-2024/1200-675-23053822-thumbnail-16x9-rbi.jpg)
Published : Dec 6, 2024, 10:14 AM IST
|Updated : Dec 6, 2024, 11:17 AM IST
డిసెంబరు 4 నుంచి మూడు రోజుల పాటు ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిగింది. ఆ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. ద్రవ్యోల్బణం, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయొద్దని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రెపో రేటుతో పాటు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 6.25 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ బ్యాంక్ రేటును 6.75 శాతంగా ఉంచినట్లు తెలిపారు. వృద్ధికి బలమైన పునాదిని వేసేందుకు మన్నికైన ధర స్థిరత్వం మాత్రమే అవసరమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
కీలక అంశాలు
- 2024-25లో వాస్తవ జీడీపీ వృద్ధిరేటు అంచనా 6.6శాతం. గత ద్వైమాసిక సమీక్షలో దీన్ని 7.2శాతంగా అంచనా వేయగా, ప్రస్తుతం తగ్గింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో వృద్ధిరేటు అంచనాల కంటే తక్కువగా 5.4శాతంగా ఉంది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు పెంపు. గతంలో దీన్ని 4.5శాతంగా పేర్కొన్నగా, తాజాగా 4.8శాతం ఉండొచ్చని అంచనా. ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో కారణంగా ద్రవ్యోల్బణం అంచనాలను పెంపు.
- 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ కరెంట్ ఖాతా లోటు స్థిరంగా ఉంటుంది. ద్రవ్యలభ్యత మిగులు స్థాయిలోనే ఉంది.
- బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు బలంగా కొనసాగుతున్నాయి. ఆర్థిక రంగం ఉత్తమంగా ఉంది.
- క్యాష్ రిజర్వ్ రేషియోను 4.5శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. బ్యాంకులకు రూ.1.16లక్షల కోట్ల నగదు అందుబాటులో ఉంది.
- రూపాయి విలువను బలోపేతం చేసేందుకు ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లపై వడ్డీరేటు పరిమితి పెంపు.
- వ్యవసాయ రంగంలో తనఖా లేని రుణాల పరిమితిని రూ.1.6లక్షల నుంచి రూ.2లక్షలకు పెంపు.