Ratan Tata Animal Hospital : టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా గురించి తెలియనివారు ఎవరూ ఉండరు. భారత్లోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ వ్యాపారవేత్తగా ఆయనకు పేరుంది. పారిశ్రామికవేత్తగానే కాకుండా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా రతన్ టాటాను అందరూ గౌరవిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే రతన్ టాటా తన కంపెనీల తరపున పేదలను ఆదుకుంటూ ఉంటారు. అలానే మూగ జీవాలంటే ఎంతో ప్రేమ ఉంది. వాటి కోసం ఓ ప్రాజెక్టు తలపెట్టారు. అది వచ్చే నెలలో ప్రారంభం కానుంది.
ముంబయిలో జంతువుల కోసం రతన్ టాటా అత్యాధునిక సౌకర్యాలతో 'టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హస్పిటల్' అనే పేరుతో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నారు. దీనిని సుమారు 2.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.165 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇది భారతదేశంలోనే అతి పెద్ద జంతు వైద్యశాలగా మార్చి నెలలో ప్రారంభం కానుంది. ఈ ఆస్పత్రి కుక్కులు, పిల్లులు, కుందేళ్లు వంటి ఇతర చిన్న జంతువులకు 24*7 వైద్య సేవలను అందించనుంది.
"పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా భావిస్తాను. నా జీవితం అనేక పెంపుడు జంతువుల మధ్య సాగింది. ఒక సంరక్షకుడిగా వాటికి ఆస్పత్రి అవసరం అని గుర్తించాను. అందుకే ఈ వైద్యశాలను నిర్మిస్తున్నా."
- రతన్ టాటా, టాటా గ్రూప్ ఛైర్మన్