Pros And Cons Of Taking Multiple Home Loans : భవిష్యత్‌లో ఆర్థిక లాభాలు సంపాదించడం కోసం మనం ఎన్నో రకాల మార్గాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటాం. అందులో భాగంగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తారు. ముఖ్యంగా ఇళ్లను కొనుగోలు చేసి, భవిష్యత్‌లో మంచి లాభాలకు అమ్మాలని ఆశిస్తారు. మరికొందరు ఇంటిని అద్దెకు ఇచ్చి, నెలవారీ ఆదాయం సంపాదించాలని చూస్తారు. అందుకోసం బ్యాంకుల నుంచి అనేక సార్లు హోమ్ లోన్ తీసుకుని మరీ ఇళ్లను కొనుగోలు చేస్తుంటారు. మరి ఇలా పలుమార్లు హోమ్ లోన్ తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం
పక్కా ప్రణాళిక
సొంత ఇల్లు అనేది చాలా మందికి ఒక కల. కానీ వ్యాపారంలో భాగంగా ఇళ్లు కొనడం అనేది పూర్తిగా ప్రత్యేకమైన విషయం. ఒకవేళ మీరు వ్యాపారం నిమిత్తం పలుమార్లు హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటే, అందుకు అనేక అంశాలను పరిగణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హోమ్ లోన్స్ తీసుకునే ముందు, కచ్చితమైన ప్రణాళికతో ముందుకెళ్లాలి. మీ ఆర్థిక పరిస్థితులను, సంసిద్ధతను సమీక్షించుకోవాలి. మీ భవిష్యత్ అవసరాలకు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకోవాలి. అవసరమైతే నిపుణులు సలహాలు తీసుకోవాలి.
సమీక్ష
హోమ్ లోన్ తీసుకునే ముందు మీ ఆర్థిక లక్ష్యాన్ని సమీక్షించుకోవాలి. ఇళ్లను అద్దె ఆదాయం కోసం కొంటున్నారా? లేదా ధర పెరిగిన తర్వాత విక్రయించి సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నారా? లేదా సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపేందుకు వాడుకోవాలని భావిస్తున్నారా? లేదా పెరుగుతున్న కుటుంబ అవసరాలకు అనుగుణంగా పెద్ద ఇంటిని తీసుకుంటున్నారా? అనే అంశాలను సమీక్షించుకోవాలి. దానికి అనుగుణంగా పక్కా ప్రణాళిక వేసుకోవాలి.
ఆర్థిక సంసిద్ధత
వ్యాపారం కోసం హోమ్ లోన్ తీసుకుంటే, అనేక ఆర్థిక పర్యవసానాలు ఏర్పడతాయి. అందువల్ల హోమ్ లోన్స్ తీసుకునే ముందు అనేక రకాల ప్రశ్నలు వేసుకోవాలి. అవేంటే ఇప్పుడు చూద్దాం.
- ఇప్పటికే ఉన్న రుణాలను ఎంత వరకు తీర్చారు? ఇంకా ఎంత మొత్తం బకాయి ఉంది? వాటిని తీర్చేందుకు సరిపడా ఆదాయ వనరులు మీ దగ్గర ఉన్నాయా?
- అత్యవసర సమయాల్లో అక్కరకు వచ్చేలా, మీకు స్థిరమైన ఆదాయ మార్గాలు ఉన్నాయా? కొత్త రుణాలను తీర్చేందుకు అవి సరిపోతాయా?
- డౌన్‌పేమెంట్‌కు కావాల్సినంత డబ్బు మీ చేతిలో ఉందా? హోమ్ లోన్ తీసుకునేటప్పుడు, ఏమైనా అదనపు రుసుములు చెల్లించాల్సి వస్తే, అందుకు తగినంత డబ్బులు మీ దగ్గర ఉన్నాయా?
- రెండోసారి హోమ్ లోన్ తీసుకునేందుకు కావాల్సిన అర్హతలు మీకు ఉన్నాయా? లేదా మల్టిపుల్ హోమ్ లోన్స్ తీసుకునే సామర్థ్యం మీకు ఉందా?
ఇలా అన్ని విధాలుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి.