Post Retirement Financial Planning Tips: జీవితాంతం కష్టపడి పనిచేసిన వాళ్లు వృద్ధాప్యంలోనైనా ప్రశాంతంగా జీవితం గడపాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఆ సయమంలో ఎలాంటి ఆర్థికపరమైన ఒత్తిడి లేకుండా ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అందుకోసం ఉద్యోగం చేస్తున్న సమయంలోనే కచ్చితమైన ప్రణాళికలు వేసుకోవాలి. అప్పుడే అనుకున్న విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని కొనసాగించగలం. అందుకోసం ముందు జాగ్రత్తగా ఎలాంటి ప్రణాళికలు చేసుకోవాలో చూద్దాం.
ఉద్యోగంలో చేరినప్పుడు పదవీ విరమణ గురించి కూడా ఆలోచించాలి. అయితే ఈ సాధారణ విషయాన్ని ఎవరూ అంతగా పట్టించుకోరు. తీరా ఉద్యోగ విరమణకు ఇంకా రెండు మూడేళ్ల వ్యవధే ఉందని తెలిసినప్పుడు ఆలోచిస్తారు. అప్పటికప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. దీర్ఘకాలిక లక్ష్యాన్ని స్వల్పకాలంలోనే సాధించాలని అనుకుంటారు. కానీ, అప్పుడు అది అంత తేలిక కాదు.
పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు
ప్రయాణం మొదలు పెట్టేముందు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆర్థిక విషయాల్లోనూ అలానే ఉంటుంది. అయితే, మనం వేసుకున్న ప్రణాళిక కాలానుగుణంగా వాస్తవ పరిస్థితుల్లో సవరించుకునేలా ఉండాలి. ప్రణాళికలు పెట్టుకుంటే సరిపోదు. దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే విలువ ఉంటుంది. ఇప్పుడున్న ప్రణాళిక 10 ఏళ్ల తర్వాత పూర్తిగా భిన్నంగా ఉండొచ్చు. ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం, మారుతున్న అవసరాలు, జీవన శైలిలో మార్పులు ఇలా ఎన్నో కారణం అవుతాయి. అందుకే ముందుగా మీరు ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులు భవిష్యత్‌లో ఎలా ఉండొచ్చు అనే విషయాన్ని కూడా ఆలోచించుకోవాలి. అందుకు అనుగుణంగా పొదుపు మొత్తాలను కేటాయించండి. పదవీ విరమణ ప్రణాళిక నిరంతరం సాగే ప్రక్రియ. మధ్యలో ఆపేస్తే విశ్రాంత జీవితంలో ప్రశాంతతకు కొరవడుతుంది.
పొదుపు, పెట్టుబడులు
మీ నెలవారీ ఖర్చుల పట్ల అంచనాకు వచ్చాక అందుకు అనుగుణంగా మీ పొదుపు, పెట్టుబడులు ఉన్నాయా అని చూసుకోవాలి. మీ పదవి విరమణ సమయానికి ఎంత మొత్తం జమ అయ్యే అవకాశం ఉందనేది లెక్క వేసుకోవాలి. చాలామంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, మ్యూచువల్ ఫండ్లు, స్థిరాస్తి తదితర మార్గాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. వీటిలో పదవీ విరమణ వరకూ కొనసాగేవి ఎక్కువగా ఉండవు. కొన్ని సార్లు కొంత మొత్తం పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం వెనక్కి తీసుకుంటారు. ఆరోగ్య అత్యవసరాలు ఏర్పడవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పొదుపు మొత్తాన్ని పెంచుతూ ఉండాలి. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి దీటుగా రాబడి వచ్చే పెట్టుబడులను ఎంచుకోవడం మంచిది. పదవీ విరమణ అనంతరం ఎంత మొత్తం అవసరం? ఇవి ఎంత మేరకు ఆ నిధిని జమ చేసేందుకు తోడ్పడతాయి? అనే లెక్కలు ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండాలి.