Post Office Gram Sumangal Yojana :ప్రస్తుత కాలంలో చాలా మంది పొదుపు మంత్రం పఠిస్తున్నారు. ఇందుకోసం ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఎలాంటి రిస్కూ లేకుండా ఉండాలి, అదే సమయంలో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి, ఎక్కువ రాబడి పొందాలని కోరుకునే వారికి పోస్టాఫీస్ చిన్న మొత్తాల స్కీమ్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటే.. "గ్రామ్ సుమంగల్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్". ఇది రాబడితోపాటు బీమా కూడా కల్పించే పథకం! మరి.. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఎంత పొదుపు చేయాలి ?
గ్రామ్ సుమంగల్ స్కీమ్‌లో చేరిన వారు రోజుకు కేవలం రూ.95 పొదుపు చేస్తే చాలు మెచ్యూరిటీ సమయంలో రూ.14 లక్షలను పొందవచ్చు. అంటే.. నెలకు మీరు రూ.2,850 పొదుపు చేస్తే సరిపోతుంది. ఒకవేళ పాలసీదారుడు మధ్యలో చనిపోతే.. నామినీకి రూ.10 లక్షలను చెల్లిస్తారు. మెచ్యూరిటీ సమయానికి పాలసీదారుడు బతికి ఉంటే రూ. 14 లక్షలు అందజేస్తారు.
ఈ ఫథకానికి ఎవరు అర్హులు?
గ్రామ్ సుమంగల్ పథకంలో భాగం కావడానికి గ్రామీణ ప్రాంతంలో నివసించే మహిళలు, పురుషులు అందరూ అర్హులు. ఈ స్కీమ్‌లో చేరడానికి వయసు 19 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. మీరు గ్రామ్ సుమంగల్ స్కీమ్‌లో 15 ఏళ్లు లేదా 20 వరకు డబ్బులను పొదుపు చేయవచ్చు. ఈ పథకంలో 15 ఏళ్లు డబ్బులను పొదుపు చేస్తే.. 6, 9, 12 సంవత్సరాలలో ప్రతిసారీ 20 శాతం డబ్బులు చెల్లిస్తారు. మిగిలిన 40 శాతం డబ్బు మెచ్యూరిటీ తర్వాత చెల్లిస్తారు. అలాగే మీరు 20 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే స్కీమ్‌లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే.. 8, 12, 16 ఏళ్లలో ప్రతిసారీ 20 శాతం డబ్బు చెల్లిస్తారు. మిగిలిన 40 శాతం డబ్బు మెచ్యూరిటీ తర్వాత అందజేస్తారు.