Phonepe Indus AppStore Launch :ఫోన్‌పే సంస్థ గూగుల్, యాపిల్ ప్లేస్టోర్లకు పోటీగా ఇండస్ యాప్‌స్టోర్‌ను తీసుకువస్తోంది. ఫిబ్రవరి 21న దిల్లీలో దీనిని లాంఛ్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులు, స్టార్టప్ సంస్థలు, పరిశ్రమల ప్రతినిధుల దృష్టిని ఆకర్షించేందుకే ఫోన్‌పే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఫోన్‌పే సంస్థ గతేడాది సెప్టెంబర్ నెలలో ఇండస్ యాప్‌నకు సంబంధించిన డెవలపర్ ప్లాట్‌ఫాం ఆండ్రాయిడ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే యాప్ డెవలపర్ల కోసం ఈ సరికొత్త ఇండస్యాప్ను ఒక సంవత్సరం పాటు ఎలాంటి రుసుము లేకుండా యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆ కాలవ్యవధి పూర్తయ్యాక నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుందని గతంలోనే ఫోన్‌పే స్పష్టం చేసింది.
ఎలాంటి ఛార్జెస్ లేవు!
గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్లు డెవలపర్ల నుంచి రుసుములు, కమీషన్లు వసూలు చేస్తున్నాయి. వీటివల్ల డెవలపర్లపై అధిక ఆర్థిక భారం పడుతోంది. అందుకే వీటికి భిన్నంగా ఫోన్‌పే డెవలపర్ల నుంచి ఎలాంటి రుసుములు వసూలు చేయకూడదని నిశ్చయించుకుంది. అదే గూగుల్ ప్లేస్టోర్‌కు, ఫోన్‌పే ఇండస్స్టోర్కు ఉన్న ప్రధానమైన బేధం.