తెలంగాణ

telangana

ETV Bharat / business

OPS Vs NPS Vs UPS- ఉద్యోగులకు ఈ మూడింట్లో ఏ పెన్షన్​ స్కీమ్ బెటర్? - Govt Pension Schemes - GOVT PENSION SCHEMES

OPS VS NPS VS UPS : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ యూనిఫైడ్‌ పెన్షన్‌ పథకం(యూపీఎస్). ఈ స్కీమ్ పై దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పాత పెన్షన్ విధానం(ఓపీఎస్), నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్​పీఎస్), యూనిఫైడ్‌ పెన్షన్‌ పథకం(యూపీఎస్)లో ఏది మంచిదో, వాటి విధివిధానాల్లో ఉన్న తేడాలేంటో తెలుసుకుందాం.

OPS VS NPS VS UPS
OPS VS NPS VS UPS (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2024, 6:56 PM IST

OPS VS NPS VS UPS : గతంలో ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ యూనిఫైడ్‌ పెన్షన్‌ పథకాన్ని(యూపీఎస్) తీసుకొచ్చింది. మరి ఉద్యోగులకు ఎన్​పీఎస్ మంచిదా? కొత్తగా తీసుకొచ్చిన యూపీఎస్​తో మేలు జరుగుతుందా? పాత పెన్షన్ విధానం బెటరా? ఈ మూడింటి మధ్య ఉన్న తేడాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

యూనిఫైడ్‌ పెన్షన్‌ పథకం(యూపీఎస్) :
దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరేలా కేంద్రం యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌(యూపీఎస్‌)ను తీసుకొచ్చింది. ఈ కొత్త స్కీమ్​ వల్ల పదవీ విరమణకు ముందు 12 నెలల్లో ఉద్యోగుల అందుకున్న మూల వేతన (బేసిక్‌) సగటులో 50 శాతం పెన్షన్​గా అందుతుంది. మిగిలిన వారికి సర్వీసును బట్టి పెన్షన్‌ వర్తిస్తుంది. రూ.10 వేలు కనీస పెన్షన్‌ రావాలంటే 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి.

వారందరూ యూపీఎస్​లో మారొచ్చు
2004 ఏప్రిల్‌ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్​పీఎస్‌ వర్తిస్తుంది. ఇప్పుడు ఎన్​పీఎస్ చందాదారులంతా యూపీఎస్​లోకి మారవచ్చు. ఉద్యోగులు కొత్తగా తీసుకొస్తున్న యూపీఎస్​ను ఎంచుకుంటే అదనపు భారం వారిపై పడదు. ప్రస్తుతం ఉన్న 10శాతం చందానే చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వాటా 14.5 శాతం నుంచి 18 శాతానికి పెరుగుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి (2025 ఏప్రిల్‌ 1 నుంచి) యూపీఎస్‌ అమల్లోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వాలూ యూపీఎస్​లో చేరితే 90 లక్షల మందికి లాభం కలుగుతుంది.

పాత పెన్షన్ స్కీమ్(OPS)
2004 కంటే ముందు ఉన్న పాత పెన్షన్ స్కీమ్ (OPS) ప్రకారం ఉద్యోగులు చివరిగా డ్రా చేసిన బేసిక్ పేలో 50 శాతం పెన్షన్​గా పొందేవారు. అయితే వారు ప్రభుత్వానికి తమ శాలరీలో ఎటువంటి కాంట్రిబ్యూషన్ చేసేవారు కాదు. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF)కి చందా చెల్లించేవారు. ఈ మొత్తానికి వడ్డీ కట్టి ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో ప్రభుత్వం అందించేది.

నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్​పీఎస్)
పాత పెన్షన్ విధానం కాస్త ఎన్​పీఎస్ స్కీమ్​గా మారింది. ఎన్​పీఎస్ ప్రకారం ఉద్యోగి 10 శాతం చందా చెల్లిస్తే, కేంద్రప్రభుత్వం 14శాతం ఇచ్చేది. ఉద్యోగి తన సర్వీసులో పెన్షన్ కోసం అందించిన కాంట్రిబ్యూషన్​ను ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టి దానిపై వచ్చే లాభాలపై వారి పెన్షన్లు ఆధారపడి ఉంటాయి. అయితే కొత్తగా తీసుకువచ్చిన యూపీఎస్‌ విధానంలో మాత్రం కచ్చితంగా ఇంత పెన్షన్ అందుతుందనే హామీ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు ఉంటుంది.

అయితే ఓపీఎస్​తో పోలిస్తే ఎన్​​పీఎస్ తక్కువ ఆకర్షణీయంగా ఉండడం వల్ల అనేక బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు పాత పెన్షన్ స్కీమ్​కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం టీవీ సోమనాథన్‌ నేతృత్వంలో 2023లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అధ్యయనం జరిపిన సోమనాథన్‌ కమిటీ పలు సిఫార్సులు చేసింది. దీర్ఘకాలంలో పెండింగ్​లో ఉన్న ఉద్యోగుల డిమాండ్, త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర నిర్ణయం తీసుకుని యూపీఎస్​ను తీసుకొచ్చింది.

ప్రభుత్వ ఖజానాపై భారం
యూపీఎస్ అమలు చేయడం వల్ల మొదటి ఏడాది ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ.6,250 కోట్లు భారం పడనుంది. ఈ పథకానికి సంబంధించిన మునుపటి బకాయిల కోసం రూ.800 కోట్ల అదనపు భారం పడనుంది. ఇప్పటికే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర తమ ఉద్యోగుల కోసం యూపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. మరోవైపు, యూపీఎస్ విధానంపై దేశంలో ఉన్న ఆర్థిక నిపుణులు స్పందిస్తున్నారు. యూపీఎస్ వల్ల ఉద్యోగులకు అనిశ్చితి తగ్గించడం, భవిష్యత్తులో ఉద్యోగులకు సరైన మొత్తంలో పెన్షన్ అందుతుందని పేర్కొంటున్నారు. యూపీఎస్ దేశవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతుందని థామస్ అనే ఆర్థిక నిపుణుడు ఒకరు తెలిపారు. ఇది శ్రామిక శక్తికి బలమైన మద్దతును ఇస్తుందని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details