Types Of Online Fraud :ప్రస్తుత కాలంలో బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. బ్యాంక్‌లకు వెళ్లడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. సింపుల్‌గా మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ చేయడానికే మొగ్గుచూపుతున్నారు. వాస్తవం చెప్పాలంటే, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు చాలా సులభతరం అయ్యాయి. కానీ అదే సమయంలో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు నిరంతరం కొత్త కొత్త విధానాలతో వ్యక్తులను, సంస్థలను మోసం చేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ స్కామ్స్ గురించి, డిజిటల్ పేమెంట్స్ మోసాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.
విషింగ్ స్కాం
బ్యాంకు ఖాతాదారులను మోసగించడానికి సైబర్ నేరగాళ్లు నేరుగా వాయిస్ కాల్స్ చేస్తారు. తాము బ్యాంకు అధికారులమని వ్యక్తులను నమ్మిస్తారు. తరువాత వారి బ్యాంకు ఖాతా వివరాలు, ఖాతాదారుడి పేరు, పాస్‌వర్డ్స్, డెబిట్ కార్డు పిన్ నంబర్, ఓటీపీ, సీవీవీ, అతని పుట్టిన తేదీ తదితర వివరాలు అన్నీ సేకరిస్తారు. తరువాత వారి బ్యాంకులోని డబ్బు మొత్తాన్ని లూటీ చేస్తారు. దీనినే విషింగ్ స్కామ్ అని అంటారు. కనుక తెలియని వ్యక్తులు ఫోన్ లేదా మెసేజ్ చేసినప్పుడు, మీ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఎందుకంటే, చట్టబద్ధమైన ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ఫోన్/ SMSలు చేసి మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగవు.
ఫిషింగ్
సైబర్ ఫ్రాడ్స్ మీ బ్యాంకింగ్ సమాచారాన్ని తెలుసుకోవడానికి మోసపూరిత ఈ-మెయిల్స్ పంపిస్తారు. ఆ మెయిల్ మీ బ్యాంక్ వైబ్‌సైట్ నుంచి వచ్చినట్లే ఉంటుంది. కనుక ఇలాంటి మెయిల్స్‌లో వచ్చే లింక్‌లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు. ఒకవేళ మీరు క్లిక్ చేస్తే, మీ లాగిన్ వివరాలు, ఓటీపీ, ఇతర సమాచారాన్ని కూడా అడుగుతారు. మీరు కనుక పొరపాటున ఈ వివరాలు చెప్పేస్తే, ఇక అంతే. మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బు మొత్తాన్ని కొల్లగొడతారు. దీనిని ఫిషింగ్ అని అంటారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏ బ్యాంకు కూడా మీకు మెయిల్ చేసి, మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగదు.
స్పియర్ ఫిషింగ్
కొన్ని సార్లు బ్యాంకు ఖాతాదారులను బురిటీ కొట్టించడానికి, సహోద్యోగి, యజమాని, సన్నిహితులు, బంధువుల పేరుతో ఈ-మెయిల్స్ పంపిస్తారు. దీనిని స్పియర్ ఫిషింగ్ అని అంటారు. లేదా టార్గెటెడ్ ఈ-మెయిల్ స్కామ్ అని పిలుస్తారు. మనకు బాగా తెలిసిన వాళ్ల నుంచే మెయిల్ వచ్చిందనుకుని మనం, దానిపై క్లిక్ చేస్తాం. దానితో సైబర్ కేటుగాళ్లు మీ కంప్యూటర్, మొబైల్స్‌లోని డేటా మొత్తాన్ని సులభంగా యాక్సెస్ చేయగలుగుతారు. అందుకే ఇలాంటి అనుమానిక ఈ-మెయిల్స్‌పై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.
సిమ్ స్వాప్ (మొబైల్ నంబర్ స్కామ్)
సిమ్ స్వాప్ అనేది మరో భయంకరమైన మోసం. ఇందులో బాధితుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి, అతడి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా కొత్త సిమ్ కార్డ్‌ను పొందుతారు. దీనినే సిమ్ స్వాప్ అని అంటారు. దీనితో ఆ నంబర్‌కు వచ్చిన ఓటీపీ వివరాలు అన్నీ నేరుగా సైబర్ మోసగాళ్లకు చేరతాయి. ఈ విధంగా ఖాతాదారుని బ్యాంకులో ఉన్న డబ్బులను ఈజీగా కొట్టేస్తారు. అందుకే మీ ఫోన్‌ను ఎవరికీ ఇవ్వకూడదు. ఒకవేళ మీ ఫోన్ లేదా సిమ్ కార్డ్ పోయినా లేదా పనిచేయకపోయినా వెంటనే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌కు రిపోర్ట్ చేయాలి.
స్మిషింగ్ (SMS స్కామ్)
స్మిషింగ్ స్కామర్లు బ్యాంక్ ఖాతాదారులను మోసం చేయడానికి టోల్ ఫ్రీ ఫోన్ నంబర్లు, టెక్ట్స్ మెసేజ్ లింక్‌లను పంపిస్తారు. కొత్త స్కీమ్‌లో చేరడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి అని, లేదా మీ బ్యాంకింగ్ వివరాలను అప్డేట్ చేసుకోండి అని దానిలో ఉంటుంది. పొరపాటున వాళ్లు చెప్పినట్లు చేస్తే, మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బు మొత్తాన్ని ఖాళీ చేస్తారు. అందుకే ఇలాంటి కాల్స్, మెసేజ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకూడదు.