New UPI Changes From November 2024:యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) అందుబాటులోకి వచ్చిన తరువాత ఆర్థిక లావాదేవీలు చాలా సులువైపోయాయి. ముఖ్యంగా మనం ఎలాంటి బ్యాంక్ వివరాలు నమోదు చేయకుండానే, యూపీఐ ద్వారా డబ్బులు పంపించడం, స్వీకరించడం, బిల్లులు చెల్లించడం సహా వివిధ రకాల ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చు. అందుకే తక్కువ సమయంలో అత్యధిక మంది వినియోగిస్తున్న చెల్లింపుల సాధనంగా యూపీఐ మారిపోయింది. ఈ క్రమంలో యూపీఐకి సంబంధించి రెండు ప్రధానమైన మార్పులు నవంబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అవేంటంటే?
యూపీఐ లైట్ అటో టాప్-ఆప్ ఫీచర్
యూపీఐ లైట్ వినియోగదారుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఓ కొత్త ఫీచర్‌ను ఇటీవలే తీసుకొచ్చింది. అదే యూపీఐ లైట్ ఆటో టాప్-అప్ ఫీచర్. యూపీఐ లైట్ అకౌంట్లో లిమిట్ కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్నప్పుడు, ఆటోమేటిక్‌గా బ్యాంక్ అకౌంట్ నుంచి ఫండ్స్ లోడ్ అవుతాయి. లిమిట్‌ను యూజర్లే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇది నవంబరు 1 నుంచి అమల్లోకి రానుంది.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్‌కు చెందిన సులభతరమైన వెర్షనే ఈ యూపీఐ లైట్. ఇది ఒక వ్యాలెట్‌లా పనిచేస్తుంది. దీంతో చేసే చెల్లింపులకు పిన్ అవసరం లేదు. దీనిలో గరిష్ఠంగా రూ.2000 వరకు లోడ్ చేసుకోవచ్చు. రూ.500కన్నా తక్కువ పేమెంట్‌ను యూపీఐ పిన్ లేకుండా పంపొచ్చు. అయితే నవంబరు 1 నుంచి వినియోగదారుడి యూపీఐ లైట్ అకౌంట్లో లిమిట్ కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా బ్యాంక్ అకౌంట్ నుంచి ఫండ్స్ లోడ్ అవుతాయి.
యూపీఐ తప్పనిసరి
డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసే దిశగా ఇటీవలే సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైల్ ఇన్వెస్టర్లు ఐపీఓకు దరఖాస్తు చేసుకోవాలంటే, రూ.5 లక్షల పరిమితి వరకు యూపీఐ ద్వారా నిధులను బ్లాక్ చేసుకోవాలని కోరింది. అదే సమయంలో సెల్ఫ్ సర్టిఫైడ్ సిండికేట్ బ్యాంక్‌లు లేదా స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫామ్ తదితర ప్రత్యామ్నాయ విధానాల్లోనూ ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఈక్విటీ పబ్లిక్ ఇష్యూలకు యూపీఐ బ్లాక్ ఆప్షన్ అవకాశం కూడా అందుబాటులో ఉంది.
"డెట్ సెక్యూరిటీ పబ్లిక్ ఇష్యూలకు మధ్యవర్తుల ద్వారా (సిండికేట్ మెంబర్స్, రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్లు, డీపీలు) దరఖాస్తు చేసుకునే వ్యక్తిగత ఇన్వెస్టర్లు, దరఖాస్తు రుసుము రూ.5 లక్షల వరకు ఉంటే, వారు యూపీఐ బ్లాకింగ్ ఆప్షన్నే ఉపయోగించుకోవాలి" అని సెబీ సర్క్యులర్‌లో పేర్కొంది.