Mumbai Surpasses Beijing :దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరం మరో గొప్ప క్రెడిట్‌ను దక్కించుకుంది. ఆసియాలోనే ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న నగరంగా నిలిచింది. ఈ విధంగా చైనా రాజధాని బీజింగ్‌ను అధిగమించి, తొలిసారి ఆసియా బిలియనీర్ క్యాపిటల్‌గా అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ స్థాయిలో చూసుకుంటే, అత్యంత ఎక్కువ మంది (119) బిలియనీర్లు ఉన్న నగరంగా న్యూయార్క్ ప్రథమ స్థానంలో నిలిచింది. 97మంది బిలియనీర్లతో లండన్ రెండో స్థానంలో ఉంది. 92 మంది బిలియనీర్లతో ముంబయి మూడో స్థానంలో ఉంది.
ఈ ఏడాదికిగానూ అత్యధిక మంది కుబేరులు నివాసముంటున్న నగరాల జాబితాను హురున్ గ్లోబల్ రిచ్ నివేదిక విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం, ఆసియాలో 92 మంది బిలియనీర్లతో ముంబయి మొదటి స్ధానంలో ఉంది. 91 మందితో బీజింగ్ రెండో స్థానానికి పడిపోయింది. గత ఏడాది కాలంలో ముంబయిలో కొత్తగా 26 మంది ధనవంతుల జాబితాలో చేరగా, బీజింగ్‌లో 18 మంది ఈ జాబితా నుంచి వైదొలిగారు. దీనితో ఇప్పుడు బీజింగ్‌లో 91 మంది బిలియనీర్లు మాత్రమే ఉన్నారు. కనుక బీజింగ్ ప్రపంచ స్థాయిలో నాలుగో స్థానానికి, ఆసియాలో రెండో స్థానానికి పడిపోయింది. 87 మంది బిలియనీర్లతో షాంఘై నగరం ఐదో స్థానంలో నిలిచింది.
శ్రీమంతుల నగరం
ముంబయిలోని బిలియనీర్ల మొత్తం సంపద 445 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది గత ఏడాది కంటే 47శాతం ఎక్కువ. బీజింగ్ బిలియనీర్ల మొత్తం సంపద 265 బిలియన్లు. గత ఏడాదితో పోలిస్తే ఇది 28 శాతం తక్కువ.