Monthly Household Consumer Spending In India : 11 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారుల నెలవారీ తలసరి వ్యయం (MHCS) గణాంకాలను వెల్లడించింది. దీని ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.3,773కు, పట్టణాల్లో ఇది రూ.6,459కు చేరింది.
MPCE రెట్టింపు!
కేంద్ర ప్రభుత్వం జాతీయ గణాంక సర్వే కార్యాలయం నిర్వహించిన 'గృహ వినియోగ వ్యయ సర్వే (HCES)' ఫలితాలను వెల్లడించింది. ఆగస్టు 2022 నుంచి జులై 2023 మధ్య ఈ సర్వేను నిర్వహించారు. కేంద్రం 11 ఏళ్ల తరువాత ఈ ఎంపీసీఈ వివరాలు వెల్లడించడం గమనార్హం.
తాజా గణాంకాల ప్రకారం, 2022-2023లో కుటుంబాల నెలవారీ తలసరి వినియోగ వ్యయం (MPCE) పట్టణాల్లో రూ.6,459కి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.3,773గా ఉంది. అయితే మొత్తం వ్యయంలో ఆహార ఖర్చుల వాటా గ్రామీణ ప్రాంతాల్లో 52.9 శాతం నుంచి 46.4 శాతానికి తగ్గింది. పట్టణాల్లో 42.6 శాతం నుంచి 39.2 శాతానికి క్షీణించింది.
సర్వే
దేశంలోని మొత్తం 2,61,746 కుటుంబాల నుంచి ఈ ఎంపీసీఈ వివరాలను సేకరించారు. ఈ సర్వేలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని 1,55,014 కుటుంబాలను, పట్టణాల్లోని 1,06,732 కుటుంబాలను సర్వే చేశారు. వాస్తవానికి ఈ సర్వేను ప్రతి ఐదేళ్లకోసారి నిర్వహించాలి. ఎందుకంటే జీడీపీ, రిటైల్ ద్రవ్యోల్బణం, పేదరిక స్థాయిలను నిర్ధరించడానికి ఈ ఎంపీసీఈ గణాంకాలు చాలా కీలకం అవుతాయి. కానీ పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు తర్వాత 2017-18లో చేపట్టిన సర్వే ఫలితాలను మోదీ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. పైగా సదరు సర్వేలో అనేక లోపాలు ఉన్నాయని పేర్కొంది.