Money Saving Tips In Telugu : జీవితంలో ఎంత సంపాదిస్తున్నామన్నది ముఖ్యం కాదు గానీ ఎంత పొదుపు చేస్తున్నమన్నది ముఖ్యం! వచ్చిన డబ్బును వచ్చినట్లు ఖర్చు చేసేస్తుంటే చివరికి ఏమీ మిగలదు. అందుకే ఆర్థిక నిర్వహణ అనేది ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. సరైన ఆర్థిక ప్రణాళికతో పాటు నిర్వహణపై అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ధేశించుకొని సరైన విధంగా ప్రణాళికతో వెళ్తే కావాల్సిన సంపదను సృష్టించుకోవచ్చు. అయితే మీరు కూడా డబ్బులు ఆదా చేసుకోవాలనుకుంటున్నారా? మరేం చేయాలో తెలియదా? అయితే మీకే ఈ పది సింపుల్ టిప్స్.
అన్నీ ఒక దగ్గర రాసుకోండి!
డబ్బులు ఆదా చేయాలంటే, మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే? ఒక నెలపాటు మీ ఖర్చులన్నింటినీ ఒక దగ్గర నమోదు చేసుకోండి. ఏది కూడా మిస్ చేయొద్దు. అప్పుడు అందులో వృథాగా చేసిన ఖర్చులు తెలుస్తాయి. అయితే ఖర్చులను నోట్ చేసుకోవాలంటే అందుబాటులో ఉన్న పలు యాప్స్‌ను కూడా ఉపయోగించవచ్చు.
బడ్జెట్ ముఖ్యం!
మీకు ఏం ఏం కావాలో, ఏం కొనాలో నిర్ణయించుకున్న తర్వాత ఆదాయ, వ్యయాలతో బడ్జెట్‌ను రూపొందించుకోండి. నిత్యావసరాలు, పొదుపు.. అలా అన్నింటి కోసం నిధులు కేటాయించుకోండి. ఊహించని ఖర్చులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా ఉండేలా ప్లాన్ చేసుకోండి.
ఇంట్లోనే వంట!
బయట తింటే రుచి బాగుంటుంది! కానీ ఖర్చు బాగా పెరుగుతుంది. కాబట్టి భోజనం విషయంలో ముందే ప్లాన్ చేసుకుని ఇంట్లో వంట చేసుకోండి. పెద్ద మొత్తంలో అన్ని రకాల సామగ్రిని కొనుగోలు చేసి తెచ్చుకోండి. అలా వివిధ ఆహారా పదార్ధాలను వండుకోండి. వీకెండ్స్‌లో టైమ్ పాస్‌గా స్పెషల్ చేసుకుని చక్కగా తినండి.
లంచ్ బాక్స్ తీసుకెళ్లండి!
మీరు ఎంప్లాయ్ అయితే కచ్చితంగా లంచ్ బాక్స్ తీసుకెళ్లండి. దాని వల్ల చాలా డబ్బులు ఆదా అవుతాయి. బాక్స్‌లో ఆహారాన్ని ప్యాక్ చేసుకుని వెళ్లే అటు ఆరోగ్యం బాగుంటుంది. ఇటు డబ్బులు మిగులుతాయి.
బిల్లులను తగ్గించుకోండి!
మనం వాడే వాటికి కట్టే బిల్లులను చిన్న మార్పుల ద్వారా తగ్గించండి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా లైట్స్, ఫ్యాన్స్‌ను ఆఫ్ చేయండి. ఎలక్ట్రానిక్స్ వస్తువులను అన్‌ప్లగ్ చేయండి. ఎల్ఈడీ బల్బులను ఉపయోగించండి. ఇలా చేస్తే కరెంట్ బిల్లు తగ్గే అవకాశం ఉంది.
షాపింగ్ స్మార్ట్‌గా ఉండాల్సిందే!
షాపింగ్ చేసేటప్పుడు కచ్చితంగా స్మార్ట్‌గా ఆలోచించాల్సిందే. వస్తువుల ధరలను కంపేర్ చేసుకోండి. డిస్కౌంట్ ఏమైనా ఉందా లేదా కూపన్లు ఏమైనా ఉన్నాయనే విషయాన్ని చెక్ చేసుకోండి.
సబ్‌స్క్రిప్షన్‌లను తగ్గించుకుంటే బెటర్!
ప్రస్తుత రోజుల్లో కొన్నింటిని(ఉదా: ఓటీటీ) వాడాలంటే సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సిందే. అయితే తక్కువగా ఉపయోగించిన వాటికి సబ్‌స్క్రైబ్ చేసుకోవద్దు. కావాలంటే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి సబ్‌స్క్రిప్షన్ పొందితే డబ్బులు ఆదా అవుతాయి.
మిమ్మల్నే మీరే క్వశ్చన్ చేసుకుని!
ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేసేముందు, అది మనకు అవసరమా లేదా అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఒకట్రెండు రోజులు వెయిట్ చేయండి. ఒత్తిడికి గురైన సమయంలో అస్సలు షాపింగ్ చేయవద్దు. దాని వల్ల నష్టం జరిగే అవకాశం లేకపోలేదు.
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి!
ఎప్పుడూ డబ్బులు ఖర్చు చేసి మాల్స్‌లో తిరిగే కన్నా, అప్పుడప్పుడు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయని పార్కులు, లైబ్రరీలు సందర్శించండి. ప్రశాంతంగా వాకింగ్ చేయండి. స్థానికంగా జరిగే ఎలాంటి ఎంట్రీ ఛార్జ్ లేని ఈవెంట్స్, బుక్ క్లబ్స్‌కు హాజరవ్వండి. పండగ సమయంలో పాలుపంచుకోండి.
లక్ష్యాలను నిర్దేశించుకోండి
చివరగా, అసలు ఎందుకు మీరు పొదుపు చేస్తున్నారో ముందు నిర్ణయిుంచుకోండి. అత్యవసర నిధి కోసమా లేక విహారయాత్ర కోసమా లేక ఇల్లు కొనుగోలు కోసమా, అలా దేని కోసం ఆదా చేయాలనుకుంటున్నారో ముందే ఫిక్స్ అవ్వండి. ఆ తర్వాత మీ లక్ష్యాన్ని భాగాలుగా విభజించుకోండి. అలా ఈ సింపుల్ చిట్కాలను పాటించడం ద్వారా మీరు ఎక్కువగా పొదుపు చేసుకోవచ్చు. అనుకున్న ఆర్థిక లక్ష్యాలను సాధించవచ్చు.