Money Making Tips :చాలా మంది పెట్టుబడి పెట్టి మెరుగైన ఆదాయం పొందాలనుకుంటారు. ఇందుకోసం ఎలాంటి రిస్కు లేకుండా ఎక్కువ రిటర్న్స్ అందించే పెట్టుబడి పథకాల కోసం వెతుకుతుంటారు. కొంత మందికి ఇది కాస్త ఓవర్గా అనిపిస్తుంది. కానీ నిజంగానే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు. ఇన్వెస్ట్మెంట్ జర్నీలో కొత్తగా అడుగుపెట్టినవారికి అదేలా సాధ్యమనే భావన కలుగుతుంది. కానీ ఇలాంటివారు కాంపౌండ్ ఇంట్రెస్ట్ (చక్రవడ్డీ) ప్రభావం గురించి తెలుసుకుంటే వారి ఆలోచన తప్పకుండా మారుతుంది.
ఎనిమిదో వింత!
ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టీన్ 'కాంపౌండ్ ఇంట్రెస్ట్' (చక్రవడ్డీ)ని ప్రపంచంలోని 8వ అద్భుతంగా పేర్కొన్నారు. 'విశ్వంలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది అత్యంత శక్తివంతమైంది. దీనిని ఎవరు అర్థం చేసుకుంటే వారు ఎక్కువగా సంపాదిస్తారు. అర్థం చేసుకోని వారు ఇతరులకు డబ్బులు చెల్లిస్తూ ఉంటారు' అని చక్రవడ్డీ గురించి వివరించారు. ఇంతకూ చక్రవడ్డీ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? దీనిని ఉపయోగించి గొప్ప ధనాన్ని ఎలా సంపాదించవచ్చు? అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వడ్డీపై వడ్డీ!
కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా కేవలం 25 ఏళ్లలో రూ.1 లక్షను రూ.1.5 కోట్లుగా మార్చుకోవచ్చు. ఇదేలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా? దీన్నిఅర్ధం చేసుకోవాలంటే 1998 ఆగస్టులో ప్రారంభించిన 'ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్స్ క్యాప్ ఫండ్'ను ఊదాహరణగా చెప్పుకోవాలి. ఈ ఫండ్ ప్రారంభం నుంచి ప్రతి ఏడాదీ సగటున 21.72 శాతం చొప్పున రాబడి ఇచ్చింది. ఈ లెక్కన 25 ఏళ్ల 7 నెలల వ్యవధిలో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినవారు రూ.1.5 కోట్లకు పైగా సంపాదించగలిగారు.
ఇంతకూ కాంపౌండింగ్ అంటే ఏమిటి?
ఉదాహరణకు మీరు ఒక వ్యక్తికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చారని అనుకుందాం. దీనిని అసలు అంటారు. దీనికి ఏటా వడ్డీ వస్తుంటుంది. అయితే ఒక సంవత్సరం పూర్తయిన తరువాత మీరు ఇచ్చిన అసలుకు వడ్డీ కలుస్తుంది. దీనిని తరువాతి సంవత్సరానికి అసలుగా పరిగణిస్తారు. అంటే రెండో ఏట మీరు ఇచ్చిన అసలుకే కాదు. దానికైన వడ్డీపై కూడా వడ్డీ లభిస్తుంది. ఇలా అవతలి వ్యక్తి మీ అప్పు తీర్చేవరకు వడ్డీపై వడ్డీ కలుస్తూనే ఉంటుంది. ఇదే కాంపౌండింగ్ ఎఫెక్ట్. ఇదే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది.
దీనిని మరింత సింపుల్గా చెప్పాలంటే, ఒక సంవత్సరానికి అయిన వడ్డీని అసలుకు కలిపి, దాన్ని తరువాత సంవత్సరానికి అసలుగా పరిగణించడం జరుగుతుంది. ఈ విధంగా అసలు, వడ్డీలు వరుస సంవత్సరాల్లో క్రమంగా పెరుగుతూ ఉంటాయి. ఇలా వడ్డీని లెక్కకట్టే పద్ధతిని 'చక్రవడ్డీ' అంటారు.
ఉదాహరణకు మీరు 5 శాతం వార్షిక వడ్డీ రేటును అందించే సేవింగ్స్ ఖాతాలో రూ.10,000 పెట్టుబడి పెట్టారని అనుకుందాం. మొదటి సంవత్సరం చివరిలో మీకు రూ.500 వడ్డీ లభిస్తుంది. అప్పుడు మీ పెట్టుబడి మొత్తం విలువ రూ.10,500 అవుతుంది. రెండవ సంవత్సరంలో ఆ రూ.10,500 కొత్త బేస్ అమౌంట్ అవుతుంది. అప్పుడు మీరు ఆ మొత్తంపై 5 శాతం వడ్డీని పొందుతారు. అది రూ.525కి సమానం అవుతుంది. కాబట్టి, రెండవ సంవత్సరం చివరిలో, మీ పెట్టుబడి విలువ రూ. 11,025కు చేరుతుంది. ఇలా ఏళ్లు గడుస్తున్న కొలదీ మీ డబ్బులు రెట్టింపు అవుతూనే ఉంటాయి. ఫలితంగా మీరు చాలా తక్కువ వ్యవధిలోనే బాగా సంపాదించగలుగుతారు.
ఎస్బీఐ కార్డ్ నుంచి 3 కొత్త 'ట్రావెల్ క్రెడిట్ కార్డ్స్' - ఫీచర్స్ & బెనిఫిట్స్ ఇవే! - SBI Card Travel Credit Cards 2024
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ఆ వయస్సులో తీసుకుంటే బోలెడు బెనిఫిట్స్! - Right Age for Health Insurance