Meta Disagrees With CCI Fine : కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన రూ.213 కోట్ల జరిమానా చెల్లించేది లేదని వాట్సాప్ మాతృసంస్థ మెటా ప్రకటించింది. సీసీఐ నిర్ణయంతో తాము ఏకీభవించడంలేదని, దీనిపై కచ్చితంగా అప్పీలుకు వెళ్తామని తెలిపింది. 2021లో తీసుకొచ్చిన వాట్సప్ గోప్యతా విధానం ద్వారా తప్పుడు వ్యాపార విధానాలను అవలంభించినందుకు మెటాకు సీసీఐ రూ.213 కోట్లు జరిమానా విధించింది. అలాగే వాట్సాప్‌లో వినియోగదారుల డేటాను ప్రకటనల నిమిత్తం మెటాకే చెందిన తమ ఇతర అప్లికేషన్‌లకు ఇవ్వకుండా, 5 ఏళ్లపాటు ఆపివేయాలని సీసీఐ ఆదేశించింది. అయితే సీసీఐ ఇచ్చిన ఈ ఆదేశాలను మెటా వ్యతిరేకించింది.
ప్రైవసీకి ఎలాంటి భంగం కలగలేదు!
2021లో తీసుకొచ్చిన వాట్సప్ అప్‌డేట్ కారణంగా వ్యక్తుల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని మెటా తెలిపింది. వినియోగదారుల డేటా విషయంలో పూర్తిగా పారదర్శక విధానాలనే అవలంభిస్తున్నట్లు పేర్కొంది. కొవిడ్ సమయంలోనూ, అంతకు ముందు కూడా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు నేరుగా సేవలు అందించేలా సహకారం అందించామని పేర్కొంది. చిన్న వ్యాపారాలను ప్రోత్సహించి, భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటును అందేలా చేశామని వివరించింది. అయితే తమకు పోటీ లేకుండా చేసుకునే విధానాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి, ఆన్‌లైన్ ప్రకటనల్లో మెటా గుత్తాధిపత్యం వహిస్తోందని సీసీఐ పేర్కొంది. ఇలాంటి పద్ధతులు సరికాదని, తమ వివరాలను మెటాతో పంచుకోవాలా? వద్దా? అనేది నిర్ణయించుకునే హక్కును వినియోగదారులకు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా తెలియజేయాలని సీసీఐ స్పష్టంచేసింది. ఈ సీసీఐ ఆదేశాలపై అప్పీలుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు మెటా ప్రతినిధి తెలిపారు.