Jio AI Cloud Storage:జియో యూజర్లకు రిలయన్స్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ దీపావళీ నుంచి ఏఐ క్లౌడ్ స్టోరేజీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా వెల్‌కమ్ ఆఫర్ కింద జియో యూజర్లకు 100జీబీ ఉచిత స్టోరేజ్‌ను అందించనుంది. వాటితోపాటు ఏఐ ప్లాట్‌ఫామ్ 'జియో బ్రెయిన్'ను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. తక్కువ ధరకే ఏఐ మోడల్ సర్వీసులను అందించనుంది. రానున్న ప్రతి నెలా మిలియన్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్స్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎమ్‌లో ముకేశ్ అంబానీ తెలిపారు.
వెల్కమ్ ఆఫర్ కింద 100జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీ
'జియో వినియోగదారులు తమ ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు వంటి డిజిటెల్ కంటెంట్‌ను, డేటాను భద్రంగా దాచుకునేందుకు వీలుగా జియో క్లౌడ్ స్టోరేజ్‌ను తీసుకురానున్నాం. వెల్కమ్ ఆఫర్ కింద 100జీబీ క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా అందించనున్నాం. అది కూడా ఈ ఏడాది దీపావళి నుంచి ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నాం. క్లౌడ్ స్టోరేజ్, డేటా ఆధారిత ఏఐ సేవలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని మేము భావిస్తున్నాము' అని ముకేశ్ అంబానీ అన్నారు.
జియో బ్రెయిన్
తమ యూజర్ల కోసం ఏఐ ప్లాట్‌ఫామ్ 'జియో బ్రెయిన్'ను మరింత విస్తరిస్తున్నట్లు ముకేశ్ అంబానీ వెల్లడించారు. తక్కువ ధరకే ఏఐ మోడల్ సర్వీసులను అందిస్తామని తెలిపారు. 'కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా, మెరుగైన సేవలు అందించేందుకు 'జియో బ్రెయిన్'ను జియో ప్లాట్‌ఫామ్‌లో ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు దాన్ని ఇతర రిలయన్స్ కంపెనీల్లోనూ వినియోగించనున్నాం. విద్య, ఆసుపత్రి, వ్యాపారం, వ్యవసాయ రంగాల్లో ఈ సేవలను అందించనున్నాం. యూజర్లకు కచ్చితమైన సమాచారంతో పాటు, వేగవంతమైన సేవలను అందించడమే మా లక్ష్యం' అని అంబానీ వివరించారు.
ప్రతి నెలా మిలియన్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్
రానున్న రోజుల్లో ప్రతి 30 రోజులకు ఒక మిలియన్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్‌లను సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నన్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. ప్రస్తుతం 100 రోజులకు ఒక మినియన్ ఎయిర్‌ఫైబర్ కస్టమర్లు వస్తున్నట్లు వెల్లడించారు. జియో ఎయిర్‌ఫైబర్ 100 మిలియన్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్‌లను రికార్డు వేగంతో చేరుకోగలదనే నమ్మకం తమకు ఉందన్నారు.