ITR Filing Questions :ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్)లను సమర్పించడం చాలా అవసరం. వీటి ప్రాముఖ్యతను గుర్తించకుంటే భవిష్యత్తులో కొన్ని పనులు కష్టతరంగా మారుతాయి. పన్ను చెల్లించని వారు కూడా ఐటీఆర్‌ను ఫైల్ చేయొచ్చు. కానీ చాలా మంది ఆ అవసరం లేదనే అపోహలోనే కొట్టుమిట్టాడుతుంటారు. తమ సందేహాలను తీర్చుకునేందుకు ప్రయత్నించరు. ఈ తరుణంలో ఐటీఆర్ ఫైలింగ్‌తో ముడిపడిన విలువైన సమాచారాన్ని తెలుసుకుందాం.
ఏయే సందర్భాల్లో ఐటీఆర్‌ను ఫైల్ చేయాలి?
ఐటీఆర్ గురించి 'ఆదాయపు పన్ను చట్టం -1956'లో ప్రస్తావన ఉంది. ఏయే సందర్భాల్లో ఐటీఆర్‌ను ఫైల్ చేయాలనే వివరాలు అందులో ఉన్నాయి. ఏ రకమైన పన్నులనూ చెల్లించని వారు కూడా ఐటీఆర్‌ను సమర్పించవచ్చని ఆ చట్టం చెబుతోంది. చాలా మంది ఆదాయాలు తక్కువగా ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టంలోని ఛాప్టర్ VI సెక్షన్ A ప్రకారం కనీస మినహాయింపు పరిమితి కంటే తక్కువ వార్షిక వేతనాన్ని కలిగిన వారిపై ఎలాంటి పన్నులూ ఉండవు. ఈ వార్షిక వేతన పరిమితి దాదాపు రూ.2.50 లక్షల దాకా ఉంటుంది. ఇలాంటి వారు కూడా ఐటీఆర్‌ను దాఖలు చేయొచ్చు.
ఏయే సంవత్సరాల కోసం ఐటీఆర్‌ను ఫైల్ చేయాలి? రాబోయే సంవత్సరం కోసమా? గడిచిన సంవత్సరం కోసమా?
చాలా మందికి ఈ ప్రశ్న వస్తుంటుంది. ఐటీఆర్ ఫైలింగ్ కోసం ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబరు మధ్య కాలంలో నిర్దిష్ట తేదీలను ప్రకటిస్తుంటారు. ఆ తేదీల్లోనే ఐటీఆర్‌ను ఫైల్ చేయాలి. ఇప్పటికే 2024 సంవత్సరం డిసెంబరు నెల గడిచిపోయింది. అందువల్ల ఇప్పుడు 2023-24 (మదింపు సంవత్సరం 2024-25) కోసం ఐటీఆర్‌ను ఫైల్ చేయలేరు. పన్నుల చెల్లింపు వ్యవహారం అస్సలు లేని వారు ఇప్పుడు కనీసం ఐటీఆర్‌ను అప్‌డేట్ కూడా చేసుకోలేరు. సాధారణంగానైతే ఐటీఆర్‌లో జరిగిన తప్పుల సవరణ కోసం ఐటీఆర్ అప్‌డేట్ దరఖాస్తును పెట్టుకునేందుకు అనుమతిస్తుంటారు. దీన్ని కూడా గడువులోగానే సమర్పించాలి.
ఒకేసారి రెండు, మూడేళ్ల ఐటీఆర్ కోసం ఫైలింగ్ చేయొచ్చా?
ఐటీఆర్ అనేది ఒకే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయంతో ముడిపడిన అంశం. రెండు, మూడేళ్ల ఆదాయాల వివరాలతో ఒకేసారి ఐటీఆర్‌ను ఫైల్ చేయడానికి వీలుండదు. ఒకవేళ మీరు ఆ విధంగా వివిధ సంవత్సరాల ఆదాయాలను ఐటీఆర్‌లో కలిపి ప్రస్తావిస్తే, అదనంగా ఆదాయపు పన్నును చెల్లించాల్సి రావచ్చు. దీనివల్ల లాభం కలగకపోగా, నష్టం జరుగుతుంది.