Office Allowances For Salaried People : ఉద్యోగులు తమ శాలరీపై ఆదాయపు పన్ను మినహాయింపులు పొందేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వాళ్లు వాడేస్తుంటారు. కానీ తాము జాబ్ చేసే ఆఫీసు నుంచి కొన్ని అలవెన్సులను పొందడం ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపులను అతికొద్ది మందే పొందుతుంటారు. అయితే ఈ అలవెన్సులను అన్ని కంపెనీలూ అందించవు. ఒకవేళ అవి లభించాలంటే ఉద్యోగంలో చేరేటప్పుడే వాటి గురించి అడగాలి. అలవెన్సులు ఇచ్చేందుకు కంపెనీ అంగీకరిస్తే ఉద్యోగంలో ఉన్నన్ని నాళ్లు ఆర్థిక ప్రయోజనంతో పాటు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. సగటు ఉద్యోగుల పొదుపును పెంచేందుకు దోహదం చేసే 10 ఆఫీస్ అలవెన్సుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. లీవ్ ట్రావెల్ అలవెన్సు (ఎల్‌టీఏ)
ఆర్థికంగా బలంగా ఉన్న కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు లీవ్ ట్రావెల్ అలవెన్సును అందిస్తుంటాయి. కుటుంబంతో కలిసి దేశంలో ఎక్కడికైనా టూర్‌కు వెళ్లొస్తే ఆ ప్రయాణ ఖర్చుల బిల్లులను కంపెనీకి సమర్పించి ఉద్యోగులు ఎల్‌టీఏ అలవెన్సును అందుకోవచ్చు. దీనిపై ఆదాయపు పన్ను మినహాయింపును ఉద్యోగి పొందొచ్చు.
2. ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్ఏ)
ఇంటి అద్దెకు సంబంధించిన అలవెన్సును 'హెచ్‌ఆర్ఏ' అంటారు. ఉద్యోగి ఇంటి అద్దెలో కొంత భాగాన్ని కంపెనీ ప్రతినెలా చెల్లిస్తుంది. కంపెనీ నుంచి ఉద్యోగికి ఏటా లభించే హెచ్‌ఆర్ఏపై ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది.
3. ఆహార భత్యం (ఎఫ్ఏ)
కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఆహార భత్యం కూడా అందిస్తుంటాయి. పలు సంస్థలు తమ ఎంప్లాయీస్‌కు ప్రీపెయిడ్ ఫుడ్ ఓచర్స్/కూపన్లు అందిస్తాయి. ఆ ఆహార కూపన్లను వినియోగించినా ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. అలాంటి ఫుడ్ కూపన్స్‌ను వాడితే ఒక్కో మీల్‌పై రూ.50 వరకు పన్ను మినహాయింపు ఇస్తారు.
4. ప్రయాణ భత్యం (టీఏ)
ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి ఉద్యోగి చేసే రాకపోకల ఖర్చులను కూడా పలు కంపెనీలు చెల్లిస్తుంటాయి. దీన్నే ట్రావెలింగ్ అలవెన్సు అంటారు. చాలా కంపెనీలు ఈ భత్యాన్ని శాలరీ స్లిప్‌లో చేర్చి చూపిస్తుంటాయి. ఇలాంటి అలవెన్సులపైనా ఆదాయపు పన్ను మినహాయింపులు లభిస్తాయి.
5. విద్యా భత్యం (ఈఏ)
కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల పిల్లల చదువులకు కూడా అలవెన్సును చెల్లిస్తుంటాయి. దీన్నే విద్యా భత్యం అంటారు. ఈ తరహా అలవెన్సుపై ప్రతినెలా రూ.100 లేదా ఏడాదికి రూ.1200 మేర ఆదాయపు పన్ను మినహాయింపు ఉద్యోగి పొందొచ్చు. అయితే గరిష్ఠంగా ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు ఈ మినహాయింపునకు అనర్హులు.