తెలంగాణ

telangana

ETV Bharat / business

మ్యూచువల్‌ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలా? STP విధానం పాటిస్తే చాలు - లాభాలే లాభాలు! - Mutual Fund STPs

What Is STP In Mutual Funds : మీరు మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? ఎలాంటి నష్టభయం లేకుండా, భవిష్యత్​లో మంచి లాభాలు రావాలని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగత బదిలీ విధానం (ఎస్​టీపీ) ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. అది ఎలాగో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

How to do STP in mutual fund
How to do STP in mutual fund (ANI)

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2024, 2:19 PM IST

What Is STP In Mutual Funds :మీరు స్టాక్​ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? లేదా మ్యూచువల్ ఫండ్స్​లో సిప్ చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌ సూచీలు జీవన కాల గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. ఈ సమయంలో పెట్టుబడులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని కోసం అనుసరించాల్సిన వ్యూహమే క్రమానుగత బదిలీ విధానం (STP). దీన్ని ఎంచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

ఎస్​టీపీ అంటే ఏమిటి?
సాధారణంగా మనందరికీ క్రమానుగత పెట్టుబడి విధానం (SIP) గురించి తెలుసు. క్రమశిక్షణతో మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది. దీర్ఘకాలం పాటు సిప్‌ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చరిత్ర కూడా చెబుతోంది. ఇదే విధంగా 'ఎస్‌టీపీ' అనే మరో శక్తిమంతమైన సాధనం కూడా మార్కెట్లో ఉంది. మార్కెట్లు మంచి వృద్ధి పథంలో కొనసాగుతున్నప్పుడు, పెట్టుబడులను సమతౌల్యం చేసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

సాధారణంగా మ్యూచువల్​ ఫండ్ సంస్థలు అనేక రకాల పథకాలను అందిస్తుంటాయి. కనుక మీరు క్రమానుగత బదిలీ విధానం (ఎస్‌టీపీ) ద్వారా సదరు ఫండ్‌ సంస్థ అందించే ఒక మ్యూచువల్‌ ఫండ్‌ పథకం నుంచి మరోదానికి నిర్ణీత వ్యవధిలో డబ్బును బదిలీ చేసుకోవచ్చు. సాధారణంగా డెట్‌ ఫండ్ల నుంచి డబ్బును ఈక్విటీ ఫండ్లలోకి బదిలీ చేసేందుకు ఈ 'ఎస్‌టీపీ' విధానాన్ని వాడుతుంటారు. మార్కెట్‌ బాగా పెరిగినప్పుడు ఈక్విటీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను కొంత మేరకు తగ్గించుకునేందుకు కూడా దీనిని ఉపయోగిస్తారు. అంటే ఈక్విటీ ఫండ్ల నుంచి డెట్‌ ఫండ్లకు కూడా ఎస్​టీపీ ద్వారా డబ్బులు బదిలీ చేసుకోవచ్చు.

ఎలా పనిచేస్తుంది?
మదుపరులు తమ దగ్గరున్న డబ్బును, ఒక ఫండ్‌ సంస్థ అందించే లిక్విడ్‌ లేదా డెట్‌ ఫండ్ల వంటి తక్కువ నష్టభయం ఉన్న పథకాల్లో మదుపు చేస్తుంటారు. ఆ తర్వాత ఎస్​టీపీ ద్వారా నిర్ణీత మొత్తాన్ని కాలక్రమేణా ఈక్విటీ ఫండ్లలోకి బదిలీ చేస్తారు. ఇలా చేయడం వల్ల మార్కెట్‌లో ఒకేసారి మదుపు చేయకుండా, నిర్ణీత వ్యవధుల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. దీని వల్ల మదుపరులకు సగటు ప్రయోజనం లభిస్తుంది.

అవసరం ఏమిటి?
మార్కెట్లు అధిక స్థాయిల వద్ద ఉన్నప్పుడు దిద్దుబాటు ప్రభావం (కరెక్షన్​కు గురయ్యే అవకాశం) ఉంటుంది. ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే, ఎస్‌టీపీ వ్యూహం ద్వారా పెట్టుబడులు ఒకేసారి కాకుండా, కొంత కాలం పాటు మార్కెట్లోకి వెళ్లేలా చేయాలి. దీనివల్ల మార్కెట్‌ తగ్గినప్పుడు ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేసేందుకు వీలవుతుంది.

నష్టభయం తగ్గుతుంది!
ఎంత అనుభవం ఉన్నవారైనా స్టాక్​ మార్కెట్‌ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో చెప్పలేరు. అందువల్ల ఎస్‌టీపీని ఎంచుకోవడం ద్వారా, సూచీలు అధికంగా ఉన్నప్పుడు ఒకేసారి పెట్టుబడి పెట్టే బదులుగా, వివిధ స్థాయిల్లో మదుపు చేసేందుకు వీలవుతుంది. దీనివల్ల నష్టభయం బాగా తగ్గుతుంది.

భావోద్వేగాల నియంత్రణ!
సాధారణంగా మార్కెట్‌ గరిష్ఠాల్లో ఉన్నప్పుడు, త్వరలోనే అది తగ్గుతుందనే ఆందోళన పెట్టుబడిదారుల్లో ఉంటుంది. ఇలాంటప్పుడు మదుపు చేసేందుకు భయపడుతుంటారు. ఇలాంటి భావోద్వేగాలను నియంత్రించేందుకు ఎస్‌టీపీ తోడ్పడుతుంది. మార్కెట్లు గరిష్ఠంగా ఉన్నప్పుడు డెట్‌ ఫండ్లలో మదుపు చేసి, దిద్దుబాటు వచ్చినప్పుడల్లా క్రమంగా ఈక్విటీల్లోకి పెట్టుబడులను మళ్లించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకే ఈ ఎస్​టీపీని మార్కెట్‌ అస్థిరతతో ఉన్నప్పుడు లేదా మార్కెట్​ గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పుడు వ్యూహాత్మకంగా ఉపయోగించాలి.

మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేయాలా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​! - Mutual Fund Investment Tips

మ్యూచువల్ ఫండ్స్​లో నష్టపోతే ట్యాక్స్​ కట్టాలా? మినహాయింపులు ఏమైనా ఉన్నాయా? - Tax Payment When Mutual Funds Loss

ABOUT THE AUTHOR

...view details