India GDP Growth Rate 2024 : అంతర్జాతీయ రేటింగ్ సంస్థ 'మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్' 2024లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.1 శాతం నుంచి 6.8 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. అంతేకాదు 2025లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని పేర్కొంది.
అత్యంత వేగంగా అభివృద్ధి!
జీ20 దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం కొనసాగుతుందని మూడీస్ పేర్కొంది. వినియోగదారలు ధరల సూచిక (సీపీఐ) అంచనాలను కూడా మూడీస్ విడుదల చేసింది. వస్తు, సేవల కోసం వినియోగదారులు చెల్లించే ధరలలో సగటు మార్పు విషయానికి వస్తే, 2024లో సీపీఐ 5.2 శాతంగా ఉంటుందని, 2025లో ఇది 4.8 శాతానికి చేరుతుందని పేర్కొంది.
వడ్డీ రేట్లు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరికొన్ని నెలలపాటు కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని మూడీఎస్ పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల తరువాత మాత్రమే వడ్డీ రేట్ల విషయంలో మార్పులు, చేర్పులు చేయవచ్చని అభిప్రాయపడింది.
మౌలిక రంగంపై ప్రత్యేక దృష్టి
ఎన్నికల తరువాత ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం కూడా మౌలిక రంగంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించవచ్చని మూడీఎస్ తెలిపింది.