Income Tax High Value Transactions Limit :ఆదాయ పన్ను శాఖ మన దేశ ఆర్థిక వ్యవస్థ సమగ్రతను కాపాడడానికి, అక్రమ లావాదేవీలను అడ్డుకోవడానికి కృషి చేస్తూ ఉంటుంది. అక్రమ పద్ధతుల్లో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తిస్తే, ఐటీ నోటీసులు జారీ చేసి తగు చర్యలు తీసుకుంటుంది.
క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఆదాయ పన్నుశాఖ నుంచి ఎలాంటి సమస్యలు రావని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. మీరు ఒక పరిమితికి మించి యూపీఐ ట్రాన్సాక్షన్స్, కార్డ్ పేమెంట్స్, క్యాష్ డిపాజిట్స్, విత్‌డ్రాలు చేస్తే ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉంది.
సులువుగా కనిపెట్టేస్తారు!
ఆదాయ పన్ను శాఖ అధునాతన డేటా అనలిటిక్స్ టూల్స్‌ను వాడుతూ ఉంటుంది. అధికారులు ఈ టూల్స్ ద్వారా ఒక వ్యక్తికి వస్తున్న ఆదాయం, అతను చేస్తున్న ఖర్చులు గురించి సులువుగా తెలుసుకోగలుగుతారు. అవసరమైతే సదరు వ్యక్తుల బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆస్తులు, పెట్టుబడుల వివరాలు సేకరిస్తారు. చివరికి మీరు ఎక్కడెక్కడికి ప్రయాణిస్తున్నారో కూడా సులువుగా తెలుసుకుంటారు. ఈ సమాచారాన్ని అంతా నిశితంగా పరిశీలించి, మీరు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారా? లేదా? అనేది నిర్ధరణ చేసుకుంటారు. ఇంకా అవసరమైతే మీరు పని చేస్తున్న సంస్థ నుంచి, ట్రావెల్ ఏజెన్సీలు, స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి కూడా మీ ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని సేకరిస్తారు.
స్క్రూటినీ
ఐటీ శాఖ పన్ను ఎగవేతకు సంబంధించిన కేసుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా స్క్రూటినీ అసెస్మెంట్ను ప్రారంభిస్తుంది. తరువాత నోటీసులు జారీ చేస్తుంది. అంతేకాదు సాక్ష్యాలు సేకరించడానికి, పన్నులను రికవరీ చేయడానికి, నేరుగా విచారణ చేయడానికి కూడా ఐటీ డిపార్ట్మెంట్కు అధికారం ఉంటుంది. మీరు కనుక ఆర్థిక లావాదేవీలను పరిమితికి మించి నగదు రూపంలో చేసినా, ఆన్లైన్లో చేసినా ఐటీ శాఖ నోటీసులు పంపి, తగు చర్యలు తీసుకుంటుంది. సరే, ఇప్పుడు మనం ఎంత పరిమితి మేరకు మాత్రమే ఆర్థిక లావాదేవీలు చేయాలో తెలుసుకుందాం.
1. సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్ :
ఒక ఆర్థిక సంవత్సరంలో మీ పొదుపు ఖాతాలో రూ.10 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే, ఐటీ శాఖ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఒక ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమై మార్చి 31తో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో మీరు చేసిన డిపాజిట్ మొత్తం రూ.10 లక్షలు దాటితే, ఆ విషయాన్ని బ్యాంకులు కచ్చితంగా ఐటీ శాఖకు తెలియజేస్తాయి. ఎందుకంటే నిబంధనల ప్రకారం, బ్యాంకులు పరిమితికి మించి చేసిన ఆర్థిక లావాదేవీల వివరాలను 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్' (CBDT)కు నివేదించాల్సి ఉంటుంది.
మీరు ఒక అకౌంట్లో కాకుండా, బహుళ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేసినప్పటికీ, వాటి మొత్తం విలువ రూ.10 లక్షలు దాటకూడదు. దాటితే ఆ విషయం ఆదాయ పన్ను శాఖ వారికి తెలిసిపోతుంది. వారు మీకు నోటీసులు కూడా పంపడం జరుగుతుంది.
భయపడాల్సిన పనిలేదు
మీరు రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేసుకున్నంత మాత్రాన భయపడాల్సిన పనిలేదు. మీరు న్యాయబద్ధంగా డబ్బులు సంపాదిస్తూ ఉంటే, మీకు అంత ఆదాయం ఎలా వచ్చిందో ఐటీ శాఖకు తెలియజేస్తే సరిపోతుంది.
ఒకవేళ మీరు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే లేదా పన్ను రిటర్నులలో ఏమైనా వ్యత్యాసాలు ఉంటే, ఐటీ శాఖ మీపై తదుపరి చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే జరిమానాలు కూడా విధిస్తుంది.
వ్యక్తిగత ఆదాయాన్ని, వ్యాపారం ద్వారా వచ్చిన లాభాలను ఒకే అకౌంట్లో వేయకూడదు. మీకు ఏయే మార్గాల ద్వారా ఆదాయం వస్తోంది అనే వివరాలు సహా, మీ పెట్టుబడులు, ఖర్చులు, ఇతర ముఖ్యమైన లావాదేవీలు అన్నింటి గురించి సరైన రికార్డ్‌ను మెయింటైన్ చేయాలి. సక్రమంగా పన్ను రిటర్నులు దాఖలు చేయాలి. అప్పుడే మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.