Income Disparity SBI Study :దేశంలో ఆర్థిక అసమానతలు భారీగా తగ్గినట్లు శుక్రవారం విడుదల చేసిన ఎస్‌బీఐ రిపోర్ట్ స్పష్టం చేసింది. 2013-14 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో రూ.5 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్న వారిలో ఆదాయ అసమానతలు 74.2% మేర తగ్గాయని పేర్కొంది.
అసమానత అనేది ఒక అపోహ మాత్రమే!
భారతదేశంలో "విపరీతంగా ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని" ప్రజల్లో భావన ఉంది. నిజంగా ఆదాయ అసమానతలు ఉన్నాయా? లేదా? అని పరిశీలించేందుకు ఎస్‌బీఐ ఆర్థిక విభాగం ఒక అధ్యయనం చేసింది. ఇందుకోసం 2014-2023 ఆర్థిక సంవత్సరాల మధ్య ఉన్న ఆదాయ అసమానతలను విశ్లేషించింది. తాజాగా ఆ పరిశోధన నివేదికను విడుదల చేసింది.
ఈ ఎస్‌బీఐ అధ్యయనం ప్రకారం, '2015-2024 అసెస్‌మెంట్ సంవత్సరాల్లో ఆదాయ పంపిణీ వక్రరేఖ చాలా స్పష్టంగా కుడివైపునకు షిఫ్ట్ అయ్యింది. దీనిని బట్టి అల్పాదాయ బ్రాకెట్‌లో ఉన్న ప్రజలు తమ ఆదాయాన్ని బాగా పెంచుకున్నారని స్పష్టం అవుతోంది.'
"మా విశ్లేషణ ప్రకారం, గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్న వారి మధ్య ఆదాయ అసమానతలు 74.2 శాతం క్షీణించాయి. ప్రభుత్వాలు చేస్తున్న నిరంతర అభివృద్ధి కార్యక్రమాలు వల్ల, తక్కువ ఆదాయ వర్గాల వారి ఆదాయం పెరుగుతోంది" అని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. 'పన్ను సరళీకరణ విధానాలు ఐటీఆర్ ఫైలింగ్స్ పెరగడానికి ఏ విధంగా దోహదం చేశాయి' అనే శీర్షికతో ఎస్‌బీఐ ఈ నివేదిక విడుదల చేసింది.
వారి ఆదాయం గణనీయంగా పెరిగింది!
ఎస్‌బీఐ నివేదిక ప్రకారం, "రూ.3.5 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్న వ్యక్తుల్లో ఆదాయ అసమానతలు 2014లో 31.8 శాతం ఉండగా, 2021 ఆర్థిక సంవత్సరం నాటికి 12.8 శాతానికి తగ్గిపోయాయి. వాస్తవానికి ఈ ఆదాయ బ్రాకెట్‌లోని జనాభా సంఖ్యతో పోల్చితే, వారి ఆదాయం 19 శాతం మేర పెరిగింది. రూ.5.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారి ఆదాయం కూడా గత దశాబ్ద కాలంలో బాగా వృద్ధి చెందింది( AY2020 కోవిడ్ మహమ్మారి సమయంలో మినహా)."