ICICI Credit Card Block :మీరు ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లా? కొత్తగా క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారా? అయితే ఇది మీ కోసమే. సాంకేతిక లోపం వల్ల దాదాపు 17 వేల క్రెడిట్ కార్డులను బ్లాక్ చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. క్రెడిట్ కార్డులు డిజిటల్ మాధ్యమాల్లో పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు పేర్కొంది. అయితే, దీనిని వెంటనే సవరించినట్లు స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు డేటాను దుర్వినియోగపర్చినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది. ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే, కచ్చితంగా పరిహారం చెల్లిస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ హామీ ఇచ్చింది.
ఇంతకూ ఏమైంది!
బ్యాంకు అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటికే ఉన్న కస్టమర్ ఖాతాలకు, కొత్త క్రెడిట్ కార్డ్‌లు తప్పుగా అనుసంధానం అయ్యాయి. అంటే ఇప్పటికే ఉన్న కస్టమర్లు, మరొకరి కోసం ఉద్దేశించిన కొత్త క్రెడిట్ కార్డ్‌ల వివరాలు ఆన్లైన్లో చూడగలిగారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్‌లోకి లాగిన్ కాగానే, తాము అసలు దరఖాస్తు చేయకున్నా, కొత్త కార్డ్ వివరాలు కనిపించాయని పలువురు ఖాతాదారులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వాస్తవానికి బుధవారం సాయంత్రం నుంచే ఈ సమస్య సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిని ఐసీఐసీఐ బ్యాంకు గురువారం ధ్రువీకరించింది.
ఓటీపీ ఉండగా
సాంకేతిక లోపాల వల్ల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు పూర్తి సంఖ్య, సీవీవీ వంటి వివరాలను యూజర్లు కాకుండా, ఇతరులు చూడగలిగారు. అందువల్ల వారు సదరు క్రెడిట్ కార్డులను దుర్వినియోగపర్చి మోసపూరిత లావాదేవీలు జరిపే అవకాశం ఉంది. అయితే, ఓటీపీ లేకుండా ట్రాన్సాక్షన్స్ చేయడం కుదరదని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.