ICICI Bank Fraud Alert :ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్లకు ఒక హెచ్చరిక చేసింది. సైబర్ నేరగాళ్లు వాట్సాప్, ఈ-మెయిల్స్‌కు, ఎస్ఎంఎస్ల ద్వారా పంపిస్తున్న అనుమానాస్పద, హానికరమైన లింక్‌లు క్లిక్ చేయవద్దని సూచించింది. పొరపాటున ఈ లింక్‌లు క్లిక్ చేస్తే, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అలాగే నేరగాళ్లు బ్యాంకు అధికారులలాగా ఫోన్లు కూడా చేస్తున్నారు. వీటిని కూడా నమ్మవద్దని ఐసీఐసీఐ బ్యాంక్ సూచించింది.
ఆర్థికంగా నష్టపోవడం ఖాయం!
మీరు కనుక సైబర్ నేరగాళ్లు పంపించిన లింక్స్ ఓపెన్ చేస్తే, మీ డివైజ్‌లోకి హానికరమైన సాఫ్ట్వేర్లు లేదా అప్లికేషన్లు ఇన్స్టాల్ అయిపోతాయి. దీనితో మీ డివైజ్‌లో డేటా, బ్యాంకింగ్ వివరాలు వారి చేతికి చిక్కుతాయి. మీకు రావాల్సిన ఓటీపీలు కూడా సైబర్ నేరగాళ్లకే చేరతాయి. దీనితో మీ బ్యాంక్ అకౌంట్ల్లోని డబ్బులు మొత్తం సైబర్ నేరగాళ్ల దోచుకుంటారు. అందువల్ల కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లలో ఎలాంటి అనుమానాస్పద సాఫ్ట్వేర్లు, అప్లికేషన్లు ఇన్స్టాల్ చేసుకోవద్దని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.
"ఐసీఐసీఐ బ్యాంక్ ఎప్పుడూ వాట్సాప్ మెసేజ్‌లు, ఎస్ఎంఎస్లు చేసి, ఫలానా నంబర్‌కు కాల్ చేయమని, లేదా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమని కస్టమర్లను కోరదు."
- ఐసీఐసీఐ బ్యాంక్