Hyundai Motor India IPO :భారత్‌లో అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్ధమైంది. సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యందాయ్ అనుబంధ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, ఐపీఓ అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కాబోతోంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.1865-1960గా నిర్ణయించినట్లు కంపెనీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు ఎల్‌ఐసీనే (రూ.21వవేల కోట్లు) అతిపెద్ద ఐపీఓగా ఉంది. కానీ ఇప్పుడు హ్యుందాయ్ మోటార్ దాన్ని అధిగమించనుంది. గరిష్ఠ ధరల శ్రేణి వద్ద రూ.27,870 కోట్లు సమీకరించేందుకు హ్యుందాయ్ నిర్ణయం తీసుకుంది.
హ్యుందాయ్ ఐపీఓ అక్టోబర్ 15న ప్రారంభమై, 17న ముగుస్తుంది. యాంకెర్ ఇన్వెస్టర్లకు ఒక రోజు ముందుగానే అంటే 14న సబ్‌స్క్రిప్షన్ విండో తెరుచుకుంటుంది. ఐపీఓలో భాగంగా 14,21,94,700 ఈక్విటీ షేర్లను హ్యుందాయ్ మోటార్ ప్రమోటర్లు విక్రయించనున్నారు. రూ.1.6 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ఐపీఓకు వస్తోంది. తాజా షేర్లను జారీ చేయడం లేదు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ (ఇందులో ఏడు షేర్లు ఉంటాయి) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కో లాట్ కొనుగోలుకు రూ.13,720 వెచ్చించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 14లాట్లు కొనుగోలు చేసుకోవచ్చు.
భారత్‌లో 1996 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న హ్యుందాయ్, మోటార్ మారుతీ సుజుకీ.. తర్వాత రెండో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా ఉంది. దేశీయంగా 13 మోడళ్లను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా 1366 సేల్స్ పాయింట్లు, 1550 సర్వీసు పాయింట్లు ఉన్నాయి. 2024 మార్చి 31 నాటికి దాదాపు 12 మిలియన్ పాసింజర్ వాహనాలను (ఎగుమతులతో కలిపి) విక్రయించింది. మార్కెట్‌లో ఐపీఓల భూమ్ కొనసాగుతున్న వేళ హ్యుందాయ్ మోటార్ ఐపీఓకు వస్తుండడం గమనార్హం. ఈ ఏడాదిలో ఇప్పటికే 63 కంపెనీలు రూ.64 వేల కోట్లను సమీకరించాయి.