How To Transfer Shares From One Demat Account To Another : చాలా మంది మదుపర్లు ఒకటి కన్నా ఎక్కువ డీమ్యాట్ ఖాతాలను కలిగి ఉంటారు. అయితే స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు పొందాలంటే సరైన విధంగా పోర్ట్ ఫోలియో నిర్వహణ ఉండాలి. ఒక డీమ్యాట్ ఆకౌంట్ నుంచి మరో డీమ్యాట్ ఖాతాకు షేర్లను బదిలీ చేయడం అనేది చాలా మంది మదుపర్లు ఉపయోగించే టెక్నిక్.
ఒకటి కన్నా ఎక్కువ డీమ్యాట్ అకౌంట్లు ఉన్నవారు వాటిలో కేవలం షేర్లు, సెక్యూరిటీలను కలిగి ఉంటే సరిపోదు. వివిధ ఖాతాల్లో సరైన విధంగా షేర్ల నిర్వహణను కొనసాగించాలి. షేర్లను మరో డీమ్యాట్ ఖాతాకు నిరాటంకంగా ట్రాన్స్ఫర్ చేయగలగాలి. ఈ ఫీచర్ వల్ల షేర్ల కన్సాలిడేషన్ మరింత సులభమవుతుంది.
డీ మ్యాట్ ఖాతాల బదిలీ ఎలా చేయాలి?
ఒక డీమ్యాట్ నుంచి మరో డీమ్యాట్ ఖాతాకు షేర్లను ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల ద్వారా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఆఫ్‌లైన్ ప్రక్రియ కొంత ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. అందుకే ప్రస్తుతం ఆఫ్‌లైన్ కన్నా ఆన్లైన్ విధానాన్ని ఎక్కువ మంది వాడుతున్నారు.
ఆఫ్‌లైన్ ద్వారా డీమ్యాట్ షేర్ల బదిలీ
- ట్రాన్స్ఫర్ చేయవలసిన షేర్ల జాబితాను, వాటి ISIN నంబర్లతో సహా సిద్ధం చేయండి.
- టార్గెట్ క్లయింట్ ID, DP IDలు నోట్ చేసుకోండి.
- ఆఫ్ మార్కెట్ లేదా ఇంట్రా డిపాజిటరీ లాంటి తగిన ట్రాన్స్ఫర్ విధానాన్ని ఎంచుకోండి.
- మీ డిపాజిటరీ పార్టిసిపెంట్ (DP) అందించిన డెబిట్ ఇన్స్ట్రక్షన్ స్లిప్ (DIS) నింపి సైన్ చేయండి.
- పూర్తి చేసిన DIS స్లిప్‌ను మీ ప్రస్తుత బ్రోకర్ లేదా డీపీకి సమర్పించండి.
- తరువాత వారి నుంచి రసీదు పొందండి. అంతే సింపుల్!
3 నుంచి 5 పనిదినాల్లో, మీ పాత డీమ్యాట్ ఖాతా నుంచి కొత్తదానికి షేర్లు ట్రాన్స్ఫర్ అవుతాయి. అయితే, ఇందుకు మీరు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్లైన్ విధానంలో షేర్లు ట్రాన్స్ఫర్
- సీడీఎస్ఎల్ (CDSL) వెబ్సైట్ ఓపెన్ చేసి అకౌంట్ కోసం రిజిస్టర్ చేసుకోండి.
- రిజిస్ట్రేషన్ తర్వాత అవసరమైన సమాచారాన్ని నింపండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) వస్తుంది. దానిని ఎంటర్ చేసి ధ్రువీకరించండి.
- ఆ తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి, షేర్స్ ట్రాన్స్ఫర్ చేసుకోండి.
- ఒక డీమ్యాట్ అకౌంట్ నుంచి మరో డీమ్యాట్ ఖాతాకు షేర్లను బదిలీ చేయడానికి వెబ్‌సైట్‌లోని సూచనలను ఫాలో అవ్వండి.
- ట్రాన్స్ఫర్ పూర్తైన తర్వాత మీకు ధ్రువీకరణ ఈ-మెయిల్ వస్తుంది.
ఈ విధంగా మీరు ఆఫ్‌లైన్, ఆన్లైన్ విధానాల్లో ఒక డీమ్యాట్ అకౌంట్ నుంచి మరొక డీమ్యాట్ అకౌంట్‌కు షేర్లను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ ప్రాధాన్యతలకు, అవసరాలకు అనుగుణంగా మీకు నచ్చిన పద్ధతిని ఎంచుకోండి.