Pension Claim With New Form 6A :మీరు ఉద్యోగం చేస్తున్నారా? త్వరలోనే రిటైర్ అవుతున్నారా? అయితే ఇది మీ కోసమే. ఇకపై మీరు పదవీ విరమణ చేసిన తరువాత చాలా సులభంగా పెన్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' (ఈపీఎఫ్‌ఓ) కొత్తగా 'అప్లికేషన్ ఫారమ్ 6A'ను ప్రవేశపెట్టింది. ఈ ఫారాన్ని ఆన్‌లైన్‌లో, ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో సమర్పించవచ్చు. దీని వల్ల మీ పెన్షన్ క్లెయిమ్ చాలా వేగంగా పూర్తవుతుంది.
ఇప్పటి వరకు ఈపీఎఫ్‌ఓ 'ఉద్యోగుల పెన్షన్ స్కీమ్' (ఈపీఎస్) కింద పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ అందిస్తూ వస్తోంది. అయితే ఇందుకోసం ఆఫ్‌లైన్‌లో పెన్షన్ క్లెయిమ్ చేయవలసి వచ్చేంది. దీని వల్ల ఎంతో సమయం వృథా అయ్యేది. రిటైర్ అయినవాళ్లకు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. దీనిని తొలగించడానికే ఈపీఎఫ్‌ఓ కొత్త ఫారమ్ 6Aను ప్రవేశపెట్టింది.
పెన్షన్ అప్లికేషన్ ఫారం 6-A అంటే ఏమిటి?
ఫారమ్ 6Aలో ఉద్యోగి వ్యక్తిగత సమాచారం, ఈపీఎఫ్, బ్యాంక్ ఖాతా వివరాలు అన్నీ ఒకేసారి నమోదు చేయవచ్చు. కనుక మాన్యువల్ డాక్యుమెంటేషన్‌ను బాగా తగ్గుతుంది. ఇలా నింపిన ఫారాన్ని ఈపీఎఫ్‌ఓ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. లేదా నేరుగా మీ కంపెనీ యజమానికి కూడా అందించవచ్చు. దీని వల్ల చాలా వేగంగా పెన్షన్ క్లెయిమ్ పూర్తి అవుతుంది.
కొత్తగా ఫారం 6A ఎందుకు?
ఇంతకు ముందు పెన్షన్ దరఖాస్తు ప్రక్రియ చాలా గజిబిజిగా ఉండేది. ఇందుకోసం చాలా పత్రాలు కూడా జత చేయాల్సి ఉండేది. పైగా కచ్చితంగా ఈపీఎఫ్‌ఓ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఫారం 6Aతో ఈ సమస్యలకు చెక్ పడింది. రిటైర్ అయిన ఉద్యోగులు ఈ ఫారాన్ని సులభంగా నింపి, ఆన్‌లైన్‌లో సమర్పిస్తే చాలు. దాని ఆమోదం వేగంగా పూర్తి అవుతుంది. కనుక ఎలాంటి ఆలస్యం లేకుండా పెన్షన్ ఉద్యోగుల చేతికి అందుతుంది.