How To Maximize Credit Card Points : నేడు క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. స్పెషల్ ఆఫర్లు, రివార్డు పాయింట్లు లాంటి బెనిఫిట్స్ లభిస్తుండడం వల్ల చాలా మంది ఈ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. చాలా మంది కిరాణా వస్తువుల కొనుగోలు నుంచి విమానం టికెట్ల బుకింగ్ వరకు అన్నింటికీ క్రెడిట్ కార్డుల ద్వారానే పేమెంట్స్ చేస్తూ, రివార్డ్ పాయింట్లు సంపాదిస్తుంటారు. వీటిని రీడీమ్ చేసుకుని మరిన్ని ప్రయోజనాలు పొందుతుంటారు. మరి మీరు కూడా ఇలాంటి బెనిఫిట్స్ పొందాలని అనుకుంటున్నారా?
అపోహలు వీడండి!
క్రెడిట్ కార్డుల వినియోగాన్ని అనుసరించి రివార్డు పాయింట్లు లభిస్తుంటాయి. అయితే చాలా మంది ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తే, ఎక్కువ రివార్డు పాయింట్లు, గిఫ్ట్ వోచర్లు వస్తాయని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. క్యాష్‌బ్యాక్‌లు, రివార్డ్ పాయింట్లు వస్తున్నాయి కదా అని, శక్తికి మించి ఖర్చు చేస్తే మొదటికే మోసం వస్తుంది. పైగా అప్పుల ఊబిలో కూరుకపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మీ అవసరాలకు అనుగుణంగా, వీలైనంత తక్కువగా ఖర్చు చేయాలి. వాస్తవానికి అవసరాలకు అనుగుణంగా క్రెడిట్ కార్డు పేమెంట్స్ చేస్తూ, అధికంగా రివార్డ్ పాయింట్స్ సంపాదించేందుకు కొన్ని టిప్స్ ఉపయోగించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సరైన కార్డును ఎంచుకోవాలి!
నేడు చాలా బ్యాంకులు అన్ని ఆదాయ వర్గాల వారికి సులభంగా క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే మీరు మాత్రం ఏదిపడితే అది కాకుండా, మీ ఖర్చులకు, జీవనశైలికి అనుగుణంగా ఉన్న క్రెడిట్ కార్డ్‌ను మాత్రమే ఎంచుకోవాలి.
ఉదాహరణకు తరచుగా ప్రయాణాలు చేసేవారు ట్రావెల్ రివార్డ్‌లు అందించే కార్డ్‌ను ఎంచుకోవాలి. పెట్రోల్, డీజిల్ లాంటి ఫ్యూయెల్స్ కోసం అధికంగా ఖర్చు చేసే వారైతే, ఆ తరహా కార్డులను తీసుకోవాలి. దీని వల్ల మీ అవసరాలు తీరుతాయి. పైగా అధికంగా రివార్డు పాయింట్లు కూడా లభిస్తాయి.
ముందే నిబంధనలు తెలుసుకోవాలి!
ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. వేర్వేరు క్రెడిట్ కార్డులు ద్వారా లభించే రివార్డు పాయింట్లు వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల క్రెడిట్ కార్డు తీసుకునే ముందు కచ్చితంగా రివార్డ్ పాయింట్లు గురించిన నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి. ఏ కార్డు వల్ల ఎక్కువ లాభం ఉంటుందో, దానినే ఎంచుకోవాలి.