How To Maintain Credit Score During Unemployment :బ్యాంకులు లేదా రుణదాత లోన్స్ ఇచ్చే ముందు కచ్చితంగా రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటే తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేస్తాయి. క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నవారి లోన్ దరఖాస్తును తిరస్కరించొచ్చు. లేదంటే రుణంపై అధిక వడ్డీ వేస్తాయి. అందుకే లోన్లు ఈజీగా, తక్కువ వడ్డీ రేటుతో మంజూరు అవ్వాలంటే క్రెడిట్ స్కోరు చాలా ముఖ్యం. అప్పుడే మీరు రుణదాతతో లోన్ వడ్డీ రేట్ల విషయంలో మాట్లాడగలరు. ఈ క్రమంలో నిరుద్యోగులు మంచి క్రెడిట్ స్కోరును మెయింటెన్ చేయాలంటే పాటించాల్సిన టిప్స్ ఏంటో తెలుసుకుందాం.
నిరుద్యోగులకూ ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఆ సమయంలో కొందరు బ్యాంకు లోన్లు, క్రెడిట్ కార్డుపై రుణాలు తీసుకుంటారు. అయితే క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐను సకాలంలో చెల్లించడంలో విఫలమవుతారు. అప్పుడు క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది.
నిరుద్యోగం క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుందా?
నిరుద్యోగం నేరుగా మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయదు. క్రెడిట్ బ్యూరోలు మీ ఉద్యోగం, ఆదాయానికి బదులుగా మీ ఆర్థిక ప్రవర్తన ఆధారంగా క్రెడిట్ స్కోర్‌ను నిర్ణయిస్తాయి. సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐ కట్టకపోతే మాత్రం క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది. తర్వాత లోన్ల మంజూరు కష్టమైపోతుంది. అందుకే ఉద్యోగం లేనప్పుడు ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి.
మీ క్రెడిట్ నివేదికను సమీక్షించండి
మీరు ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోరును చెక్ చేసుకోవాలి. చెల్లని ఆలస్య చెల్లింపులు, మీకు చెందని ఖాతాలు నుంచి ఏవైనా బిల్లులు కట్టినట్లు గుర్తిస్తే వెంటనే రుణదాతలకు విషయం తెలియజేయాలి. లేదంటే ఆలస్య చెల్లింపులు వంటివి మీ క్రెడిట్ హిస్టరీలో యాడ్ అయిపోతాయి. దీంతో క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది.
సకాలంలో బిల్లులు కట్టేయండి
మీ పేమెంట్ హిస్టరీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుందనే విషయం మర్చిపోవద్దు. క్రెడిట్ కార్డు, రుణాలపై కనీస చెల్లింపులు చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. లేదంటే ఆలస్య చెల్లింపులు వల్ల క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది.