How To Get Shares In IPO :స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నవారందరూ ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ గురించి ఏదో ఒక సమయంలో వినే ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో స్టాక్ మార్కెట్లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్( ఐపీఓ)ల జోరు నడుస్తోంది. చాలా వ్యాపార సంస్థలు ప్రజలనుంచి మూలధన నిధులను ఐపీఓల ద్వారా సమీకరిస్తున్నాయి. అలాంటి వాటిలో కొన్ని ప్రారంభ లాభాలను అందించి ఇన్వెస్టర్లకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి. దీంతో ఐపీఓలకు దరఖాస్తు చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, ఇందులో కొందరికి మాత్రమే షేర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఓలో షేర్లు రావాలంటే అనురించాల్సిన వ్యూహాలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌లో షేర్ల కేటాయింపు పూర్తిగా యాంత్రికంగానే జరుగుతుందనేది గమనించాల్సిన అంశం. ఈ స్టాక్స్ కేటాయింపు ప్రక్రియలో మానవ ప్రమేయం ఉండే అవకాశం లేదు. ఐపీఓ అప్లికేషన్లు అధికంగా వచ్చినప్పుడు దరఖాస్తు చేసిన వారందరికీ కనీసం ఒక లాట్ కేటాయించే విధంగా ప్రాధాన్యం ఇస్తుంటారు.
- బహుళ డీమ్యాట్ ఖాతాలు
Multiple Demat Accounts :ఇన్వెస్టర్లు తమకున్న అన్ని డీమ్యాట్ అకౌంట్ల నుంచీ ఐపీఓకి దరఖాస్తు చేస్తుంటారు. దీనివల్ల చాలా సందర్భాల్లో షేర్లు కేటాయింపు ఉండకపోవచ్చు. దీనికి బదులుగా కుటుంబ సభ్యుల పేరుమీద ఉన్న డీమ్యాట్ అకౌంట్లన్నింటి నుంచీ ఐపీఓకి దరఖాస్తు చేయడం ఉత్తమం. అలాంటప్పుడు ఏదో ఒక ఖాతాకు షేర్ల కేటాయింపు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. - గరిష్ఠ కట్-ఆఫ్ వద్ద బిడ్ :రిటైల్ పెట్టుబడిదారులు గరిష్ఠ కట్-ఆఫ్ వద్ద బిడ్ వేయాలి. కొంతమంది షేర్లను ఏ ధరకు కొనాలనుకుంటున్నారనే విషయాన్ని పేర్కొంటారు. గరిష్ఠ ధరకు కేటాయింపులు జరిగినప్పుడు వారికి షేర్లు జారీ అయ్యే వీలుండదు. కాబట్టి, ఎప్పుడూ కట్-ఆఫ్ ధర వద్దే దరఖాస్తు చేయడం మంచిది.
- షేర్-హోల్డర్ విభాగంలో : తమ అవకాశాలను మెరుగుపర్చుకునేందుకు ఇన్వెస్టర్లు వాటాదారుల కోటానూ చూడాలి. దీనికోసం మాతృ సంస్థ షేర్లను ముందుగా కొనాలి. అప్పుడు షేర్-హోల్డర్స్ విభాగంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ పోటీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి, షేర్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
- చివరి తేదీన దరఖాస్తు చేయాలని చూస్తే: ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ చివరి తేదీ వరకు చాలామంది దరఖాస్తు చేయరు. దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్రోకర్లు చివరి రోజు నిర్ణీత వ్యవధికంటే ముందే దరఖాస్తులను ఆమోదించడం నిలిపి వేయొచ్చు. ఒక సంస్థ ఐపీఓకి దరఖాస్తు చేయాలని భావించినప్పుడు మొదటి రోజునే ఆ పని పూర్తి చేయాలి. వేచి చూడటం వల్ల ఉపయోగమేమీ ఉండదు.
- బహుళ విభాగాల్లో : వ్యక్తులు రిటైల్, హెచ్ఎన్ఐ విభాగంలో దరఖాస్తు చేయలేరు. ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక పాన్ అవసరం అవ్వడమే దానికి కారణం. ఒక వేళ ఇలా దరఖాస్తు చేసినా తిరస్కరించేందుకు అవకాశాలు ఉన్నాయి. రిటైల్ పెట్టుబడిదారుడు ఐపీఓలో రూ.2లక్షలకు మించి విలువైన షేర్ల కోసం దరఖాస్తు చేసినప్పుడు ఎన్‌ఐఐ కోటాలో హెచ్‌ఎన్‌ఐగా పరిగణిస్తారు. ఈ విభాగంలో ఉన్న వారి పెట్టుబడి మిగులు, నికర విలువ అనేది రూ.2 కోట్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. మొత్తం ఐపీఓలో ఎన్‌ఐఐ విభాగానికి 15 శాతం కేటాయిస్తారు. కాబట్టి, చిన్న ఇన్వెస్టర్లకు ఇది ప్రతికూలమైన అంశం.
- యూపీఐ ద్వారా చెల్లింపు :యూపీఐతో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు దరఖాస్తు చేసుకునే వారి లావాదేవీ పరిమితిని రూ.5లక్షలకు పెంచారు. అయితే యూపీఐ ద్వారా ఒక దరఖాస్తును చేసేందుకు మాత్రమే అనుమతిస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్‌బీఎల్, యాక్సిస్ బ్యాంకులు ప్రస్తుతం 5 దరఖాస్తుల వరకు అనుమతిస్తున్నాయి.