How To Choose The Right Insurance Agent : ఆర్ధిక సమస్యలు వచ్చినప్పుడు డబ్బుల కోసం పరుగులు పెట్టడం కంటే ముందుగానే డబ్బు దాచుకోవటం మంచిది. ఇందుకు కోసం చాలా మంది బీమా చేయించుకుంటూ ఉంటారు. ఈ విషయంలో మనకి సహాయం చేసే వ్యక్తే ఇన్సూరెన్స్ ఏజెంట్/ అడ్వైజర్. సులువుగా చెప్పాలంటే బీమా ఏజెంట్. కొంత మంది ఏజెంట్లు రకరకాల కంపెనీల పాలసీలు విక్రయించినా, చాలా మంది ఒక కంపెనీ పాలసీలనే సేల్ చేస్తుంటారు. వీరు సాధారణంగా ఇంటి వద్ద నుంచే తమ కార్యకలాపాలను నిర్వహిస్తారు. కొందరైతే జీవిత బీమా పాలసీలతో పాటు వెహికల్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి కూడా విక్రయిస్తారు. ఏదేమైనా, సరైన వ్యక్తి దగ్గర పాలసీ తీసుకున్నప్పుడు మాత్రమే, పాలసీదారులు సులువుగా దానిని క్లెయిమ్ చేసుకోగలుగుతారు. అందుకే జీవితంలో బీమా ఎంత అవసరమో, సరైన బీమా ఏజెంట్‌ను ఎంచుకోవడం కూడా అంతే అవసరం అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
బీమా ఏజెంట్ ఎలా ఉండాలంటే?
మీరు బీమా ఏజెంట్‌ను ఎన్నుకొనేటప్పుడు, ముందుగా అతని ప్రాథమిక అర్హతలు గురించి తెలుసుకోవాలి. అతను చురుకుగా పనిచేస్తున్నాడా? లేదా? పరిశీలించాలి. ఎందుకంటే, మంచి అర్హతలు, చురుకుదనం ఉన్న ఏజెంట్ మాత్రమే మీ కుటుంబ బాధ్యతలు, ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత పరిస్థితులను అర్థం చేసుకుని, మీకు అనుగుణమైన, మీ అవసరాలు తీర్చే పాలసీలను సూచించగలుగుతాడు.
క్లయింట్ల అవసరాలతో సంబంధం లేకుండా, కేవలం కమీషన్ సంపాదించడం మాత్రమే పనిగా పెట్టుకున్న వ్యక్తులు ఈ వ్యాపారంలో ఎక్కువ కాలం కొనసాగలేరు. వాస్తవానికి ఇలాంటి వారు పాలసీదారుని పట్ల బాధ్యతగా వ్యవహరించలేరు కూడా.
ఒక మంచి బీమా ఏజెంట్ పాలసీదారుడి అవసరాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. పాలసీల గురించి చర్చించేటప్పుడు నిజాయతీగా వ్యవహరించాలి. మీకు తగిన పాలసీని గుర్తించి, దానికి సంబంధించిన వివరాలు, ప్రయోజనాలు, లోపాలను స్పష్టంగా, సరళంగా వివరించాలి. మీ అనుమానాలను తీర్చాలి. అలాగే మీకు సూచించిన పాలసీ అనేది అతనికి వచ్చే కమీషన్ బట్టి కాకుండా మీ అవసరాన్ని బట్టి ఉండాలి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే, పాలసీ కొనుగోలు చేయమని మీపై ఒత్తిడి చేయకూడదు.
బీమా ఏజెంట్ పాలసీ పని తీరు, ప్రీమియం ఖర్చులు, ప్రాసెస్ అప్‌డేట్స్, పాలసీ పునరుద్ధరణ, క్లెయిమ్ ప్రాసెస్ లాంటి వివరాలను కస్టమర్లకు చాలా స్పష్టంగా తెలియజేయాలి. ముఖ్యంగా బీమా పట్టాలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలి. ఒకవేళ మీకు ఎలాంటి సమస్య వచ్చినా సదరు ఏజెంటు పూర్తి బాధ్యత తీసుకోవాలి. అవసరం, అనుమానం వచ్చినప్పుడల్లా ప్రీమియం చెల్లింపుల వివరాలను సమీక్షించడానికి మీకు అందుబాటులో ఉండాలి. క్లయింట్‌కు మెరుగైన సర్వీస్‌ను అందించడమే లక్ష్యంగా ఏజెంట్ పనిచేయాలి.
సరైన ఏజెంట్‌ను ఎలా కనుగొనాలి?
ఒకవేళ మీరు ఓ పర్టిక్యులర్ కంపెనీలోనే బీమా పాలసీ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటే, వెంటనే ఆ ఇన్సూరెన్స్ సంస్థను సంప్రదించవచ్చు. వాళ్లు తమ అధికారిక ఏజెంట్‌ను మీ వద్దకు పంపిస్తారు.