తెలంగాణ

telangana

మీ హోమ్ రెనోవేషన్​ కోసం రుణం కావాలా? ఇలా చేస్తే లోన్ గ్యారెంటీ! - How To Get Loan For Home Renovation

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 10:02 AM IST

Home Renovation Loan: పాత ఇంటిని రినోవేషన్ చేయిస్తే చాలా బాగుంటుంది. అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు చాలా అంశాలను ఇంటి యజమాని పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటి రినోవేషన్‌కు అయ్యే ఖర్చు దగ్గరి నుంచి భవిష్యత్తులో ఈఎంఐలు కట్టే వ్యక్తిగత సామర్థ్యం దాకా అన్నింటినీ బేరీజు వేసుకోవాలి. ఆ తర్వాతే హోం రినోవేషన్ లోన్‌కు అప్లై చేస్తే బెటర్. ఈ లోన్‌ను ఎలా పొందాలంటే?

Planning to take a home renovation loan
Home Improvement Loan - Everything You Need to Know (ETV Bharat)

Home Renovation Loan:చాలా మంది తమ పాత ఇంటిని పునరుద్ధరించుకోవాలని భావిస్తుంటారు. సరికొత్తగా ఇంటిని తీర్చిదిద్దుకోవాలని అనుకుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అంత ఈజీ వ్యవహారం కాదు. పెద్దమొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే హోం రినోవేషన్ లోన్‌ను తీసుకుంటే బెటర్. ఈ లోన్‌ను తీసుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటి విలువకు రెక్కలు
కొత్త ఇంటిని నిర్మించడానికి, పాత ఇంటికి రినోవేషన్ చేయించడానికి మధ్య చాలా తేడా ఉంది. కొత్త ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చవుతుందో మనం ముందే అంచనా వేయొచ్చు. కానీ పాత ఇంటి పునరుద్ధరణ ఖర్చును ముందే అంచనా వేయలేం. పాత ఇంటి అసలు నిర్మాణం దెబ్బతినకుండా దాన్ని జాగ్రత్తగా పునరుద్ధరించాల్సి ఉంటుంది. రిస్క్ తీసుకొని మనం పాత ఇంటిని పునరుద్ధరిస్తే, కచ్చితంగా దాని మార్కెట్ విలువ పెరుగుతుంది. అందుకే హోం రినోవేషన్ వల్ల ఆ ఇంటి యజమానులకు లాభమే తప్ప నష్టం కలగదు.

మరమ్మతు ఖర్చులకు చెల్లు
ఇంటిని రినోవేషన్ చేయిస్తే యజమానికి ప్రతి సంవత్సరం చాలా మరమ్మతు ఖర్చులు మిగిలిపోతాయి. పాత ఇంటికి పదేపదే మరమ్మతులు చేయించాల్సి వస్తుంటే, తప్పకుండా హోం రినోవేషన్‌కు మొగ్గుచూపడం బెటర్. రినోవేషన్‌ చేయించే క్రమంలో ఇంటిలో వాస్తుపరమైన మార్పులు చేసుకోవచ్చు. అదనంగా గదులు నిర్మించుకోవచ్చు. కొత్త అవసరాలకు అనుగుణంగా ఇంట్లో మార్పులు చేయొచ్చు. ఇవన్నీ కలిసి రినోవేషన్ తర్వాత ఇంటి విలువను పెంచుతాయి.

వడ్డీరేటు, రీపేమెంట్
ఇంటి రినోవేషన్ లోన్‌ను బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోవచ్చు. సాధారణ హోం లోన్ వడ్డీ రేట్లే ఈ లోన్‌కు కూడా వర్తిస్తాయి. ఫ్లోటింగ్ వడ్డీరేటు లేదా నిర్దిష్ట కాల స్థిర వడ్డీరేటుల్లో ఏదైనా ఒకదాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. ఇంటి ప్రస్తుత మార్కెట్‌ ధరపై ప్రతిపాదిత సీలింగ్‌కు లోబడి రినోవేషన్ వ్యయ అంచనాలో 100 శాతం దాకా లోన్ చేస్తారు. క్రెడిట్‌ స్కోరు బాగా ఉన్నవారికి వడ్డీరేటు తక్కువగా ఉంటుంది. మెటీరియల్స్‌, లేబర్‌ ఖర్చులు, కాంట్రాక్టర్‌ ఫీజుల వంటి రినోవేషన్ ఖర్చుల కోసం ఈ ఫండ్స్‌ను వాడాలి. ఈ లోన్ రీపేమెంట్ రూల్స్ సరళతరంగానే ఉంటాయి. హోం రినోవేషన్ లోన్‌కు వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా కూడా దరఖాస్తు చేయొచ్చు. లోన్ కాలవ్యవధి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. రుణం తీసుకునే సమయంలో మీ వయసు, ఇంటి వయసు, మీ ఆదాయం మొదలైన వాటి ఆధారంగా రుణ కాలవ్యవధిని నిర్ణయిస్తారు.

ఆర్థిక పరిస్థితిపై అంచనాకు వచ్చాకే
మీ ఆర్థిక పరిస్థితి, అవసరాలకు సరిపోయేలా ఉండే హోం రినోవేషన్ లోన్‌ను ఎంచుకోవాలి. ప్రతినెలా ఎంతమేర ఈఎంఐ చెల్లించగలరు? అనే దానిపై మీకు స్పష్టమైన అంచనా ఉండాలి. హోం రినోవేషన్ కోసం వాడే మెటీరియల్స్‌, పనివాళ్ల ఖర్చులకు ఎంత డబ్బులు అవసరం అవుతాయనే దానిపైనా ముందస్తు ఎస్టిమేషన్‌ను రూపొందించుకోవాలి. స్థానిక సంస్థల అనుమతులు, అత్యవసర ఖర్చులు వంటి అన్ని ఖర్చులను కలుపుకొని లెక్కలు వేసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాతే హోం రినోవేషన్ లోన్ కోసం బ్యాంకుకు వెళితే బెటర్. తొందరపాటులో లోన్ తీసుకొని తర్వాత కట్టలేకపోతే ఇబ్బందుల్లో పడతారు. ఈ లోన్‌కు సంబంధించిన వడ్డీ కాంపోనెంట్‌పై సెక్షన్‌ 24 కింద సంవత్సరానికి రూ.30 వేల వరకు పన్ను ప్రయోజనం లభిస్తుంది.

పర్సనల్ లోన్
ఇంటి రినోవేషన్ కోసం మనం బ్యాంకు నుంచి పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. మంచి క్రెడిట్‌ స్కోరు ఉన్నవారికి ఈ లోన్‌ను పూచీకత్తు లేకుండానే ఇస్తారు. కొన్ని బ్యాంకులు రూ.25 లక్షల దాకా పర్సనల్ లోన్ ఇస్తాయి. హోం రినోవేషన్ లోన్‌తో పోలిస్తే పర్సనల్ లోన్‌లో వడ్డీ రేటు ఎక్కువ. లోన్ రీపేమెంట్ కాల వ్యవధి ఐదేళ్లలోపు ఉంటుంది. ఎక్కువ విలువగల షేర్లు/మ్యూచువల్ ఫండ్లు కలిగి ఉన్నవారు వాటిపైనా లోన్ తీసుకోవచ్చు.

టాప్‌-అప్‌ లోన్‌
ఇప్పటికే హోం లోన్ ఉన్నవారు ఇంటి రినోవేషన్‌ను చేయదలిస్తే టాప్‌-అప్‌ లోన్‌ కోసం అప్లై చేయొచ్చు. టాప్‌-అప్‌ లోన్‌‌లో భాగంగా మీ ప్రస్తుత హోం లోన్‌ అమౌంటుకు మించి అదనపు నిధులను తీసుకోవచ్చు.ఈ ఫండ్స్‌ను హోం రినోవేషన్ సహా వివిధ పనుల కోసం వాడుకోవచ్చు. లోన్ అగ్రిమెంటుపై సంతకం చేసే ముందు నిబంధనలను పూర్తిగా చదువుకోవాలి. వడ్డీ రేట్లు, రీపేమెంట్‌ షెడ్యూల్‌, ముందస్తు చెల్లింపు జరిమానాలు, ఏవైనా అదనపు ఛార్జీల సమాచారాన్ని తెలుసుకోవాలి.

ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
హోం రినోవేషన్ లోన్‌కు అప్లై చేయాలంటే కొన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరి. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పత్రం, ఆదాయ రుజువు, ఆస్తి టైటిల్‌ డీడ్‌, గత ఆరు నెలల బ్యాంకు స్టేట్‌మెంట్‌, పునరుద్ధరణ పనికి సంబంధించిన ఇంజనీర్​ అంచనాకు సంబంధించిన ప్రాథమిక డాక్యుమెంట్స్‌ సిద్ధం చేసుకోవాలి. ఇప్పటికే హోం లోన్ తీసుకున్న వాళ్లకు ఈ డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ చాలా ఈజీగా అయిపోతుంది. కొన్ని బ్యాంకులు పే స్లిప్‌ కూడా అడగవు. ఇంటి యజమాని ఇచ్చిన అంగీకార లేఖ సరిపోతుంది. స్వయం ఉపాధి పొందేవారు రుణాన్ని తిరిగి చెల్లించగలరని నిరూపించడానికి ఆదాయ రుజువులను చూపించాలి.

రూ.1 లక్ష బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Best Scooter Under 1 Lakh

బ్యాంక్​ నుంచి భారీ మొత్తం విత్​డ్రా చేయాలా? ఇలా చేస్తే నో ట్యాక్స్​! - Bank Account Tax Rules

ABOUT THE AUTHOR

...view details