తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆరోగ్య బీమా​ క్లెయిమ్ రిజెక్ట్​ చేయడానికి కారణాలివే! ఇలా చేస్తే చిక్కులకు చెక్! - Health Insurance Claim Reject - HEALTH INSURANCE CLAIM REJECT

Health Insurance Claim Rejection Reasons : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు అత్యవసర సమయంలో ఆరోగ్య బీమా భరోసాను అందిస్తుంది. అయితే, కొన్నిసార్లు పాలసీదారుడి క్లెయిమ్​ తిరస్కరణకు గురవుతుంది. మరి అలా ఎందుకు జరుగుతుంది? దానికి గల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Health Insurance Claim Reject
Health Insurance Claim Reject (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 7:40 PM IST

Health Insurance Claim Rejection Reasons : తక్కువ ప్రీమియంతో మెరుగైన వైద్య చికిత్సలను పొందడానికి ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడం ఉత్తమైన మార్గం. ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో ఈ ప్రక్రియ మరింత సులభంగా మారింది. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే మెరుగైన ఆరోగ్య బీమా పథకం ఆర్థిక రక్షణ ఇస్తుంది. ఈ ఆరోగ్య బీమా పాలసీలను సులభంగానే కొనుగోలు చేయొచ్చు. కానీ, చికిత్సకు సంబంధించిన ప్రక్రియలో క్లెయిమ్​ తిరస్కరణకు గురువుతంది. అందుకు అనేక రకాల కారణాలుంటాయి. పాలసీదారుడు బీమా సంస్థ క్లెయిమ్​ను తిరస్కరించకుండా నిరోధించడానికి తప్పనిసరిగా పాలసీ మార్గదర్శకాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఆరోగ్య బీమా పాలసీ
ఆరోగ్య బీమా పాలసీ ఊహించని అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు లేదా ఇతర ఆరోగ్య సంరక్షణ లాంటి వాటికి అయ్యే ఖర్చుల నుంచి ఆర్థిక రక్షణను అందిస్తుంది. క్రమం తప్పకుండా ప్రీమియంలు చెల్లించడం ద్వారా పాలసీలో తెలిపిన విధంగా వైద్య సేవలకు ఆర్థిక కవరేజీని పొందొచ్చు. మన నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగత ఆరోగ్య బీమా నుంచి కుటుంబ ఆరోగ్య బీమా వరకు, సీనియర్‌ సిటిజన్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ నుంచి టాప్‌ అప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో సహా అనేక రకాల పాలసీలను కొనుగోలు చేయొచ్చు. అయితే, ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం సులభంగానే ఉంటుంది. అయినప్పటికీ, అవసరమైన సందర్భంలో క్లెయిమ్​ చేసేటప్పడు కొన్ని చిక్కులు, తిరస్కరణలు కూడా ఏర్పడతాయి.

బీమా సంస్థకు సమాచారం
వైద్య చికిత్స కోసం ఆసుపత్రిలో జాయిన్‌ అయినప్పుడు చికిత్సకు సంబంధించినవి, ఆసుపత్రి వివరాలను బీమా సంస్థకు వెంటనే తెలియజేయాలి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరినా కూడా ఆ వివరాలను 24 గంటలలోపు బీమా సంస్థకు తెలియజేయడం మంచిది. ఈ సమాచారాన్ని మనం బీమా సంస్థకు కాల్‌ చేయడం లేదా కస్టమర్‌ సర్వీస్‌ హెల్ప్‌డెస్క్‌కు ఇ-మెయిల్‌ చేయడం ద్వారా తెలియజేయవచ్చు. ఏదైనా కారణం వల్ల నిర్దేశిత వ్యవధిలోగా సమాచారం ఇవ్వకపోతే మీ క్లెయిమ్​ తిరస్కరించే అవకాశముంది. చాలా ఆసుపత్రుల్లో బీమా హెల్ప్‌డెస్క్‌ సేవలను అందిస్తున్నాయి. వాటి ద్వారా గడువులోపు సమాచారాన్ని అందించవచ్చు.

క్లెయిమ్​ మినహాయింపులు
పాలసీదారుడికి సంబంధించి ఆరోగ్య బీమా పాలసీ పరిధిలో లేని ఖర్చుల కోసం క్లెయిమ్​ చేస్తే వాటిని బీమా సంస్థ తిరస్కరిస్తుంది. ఉదాహరణకు దంత సంరక్షణ, కాస్మెటిక్‌ సర్జరీలు, గర్భధారణ సంబంధిత సమస్యలు, కొన్ని కంటికి సంబంధించిన సమస్యలకు సంబంధించివి క్లెయిమ్​లను పాలసీ పరిధిలో ఉండవు. మీ పాలసీ ద్వారా కవర్‌ అయ్యే వైద్య సమస్యలను, ఆర్థిక రీయింబర్స్‌మెంట్‌ పొందకుండా చేసే పరిమితులను గురించి ముందుగానే తెలుసుకోవాలి. వాటికి సంబంధించిన షరుతులను, నియమనిబంధనలను పాలసీ తీసుకున్నప్పుడే చూసుకోవాలి. పాలసీ కొనుగోలు చేసే సమయానికి కొన్ని నెలల ముందు వరకు ఉన్న రోగాలకు సంబంధించిన వైద్య ఖర్చులను బీమా సంస్థలు అనుమతించవు. ఒకవేళ పాలసీదారుడు అనారోగ్యం ఉంటే వారి అవసరాలకు అనుగుణంగా ఆరోగ్య బీమా ప్లాన్‌ను కొనుగోలు చేయడం మంచిది.

వెయిటింగ్‌ పీరియడ్‌
ఆరోగ్య పాలసీ తీసుకున్న వెంటనే అన్ని వ్యాధులకు బీమా క్లెయిమ్​ వర్తించదు. కొన్నింటికి వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంటుంది. అత్యవరస పరిస్థితి ఉన్నప్పటికీ వాటికి ఎలాంటి క్లెయిమ్ చేసినా తిరస్కరణకు గురవుతుంది. ముందు నుంచే అనారోగ్యంతో ఉంటే వాటికి వెయిటింగ్ పీరియడ్ సాధారణంగా 2-4 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఉదాహరణకు కంటి శుక్లం, మూత్రనాళంలో రాళ్లు, మోకాళ్ల మార్పిడి, కీళ్లనొప్పులు మొదలైన అనేక రుగ్మతలకు కోసం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. చాలా బీమా సంస్థలు కనీసం 10-15 రోగాలకు వెయిటింగ్‌ పీరియడ్‌ను వర్తింపజేస్తున్నాయి. 60 ఏళ్లు పైబడిన వారికి కొన్ని సందర్భాల్లో ఈ వెయిటింగ్‌ పీరియడ్‌ అధికంగా ఉంటుంది. అయితే, కొన్ని బీమా సంస్థలు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ సమయాన్ని తగ్గిస్తున్నాయి.

బీమా మొత్తం మించిపోతే
ఒక సంవత్సరంలో వైద్య ఖర్చుల కోసం బీమా సంస్థ మనం తీసుకున్న పాలసీ మొత్తాన్ని గరిష్ఠంగా చెల్లిస్తుంది. ఆ పరిమితి ఏడాది లోపే అయిపోతే ఆ తర్వాత దాఖలు చేసినా క్లెయిమ్​ (అదనపు ఖర్చులు) ఏమైనా తిరస్కరణకు గురువుతాయి. వాటి ఖర్చులను పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది. ఇలాంటి వాటి కోసం అధిక ప్రీమియం చెల్లించి పాలసీ పునరుద్ధరణ సమయంలో బీమా మొత్తాన్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా టాప్‌-అప్‌ ప్లాన్‌ను కొనుగోలు చేయొచ్చు. ఇది క్లెయిమ్​ చేసేటప్పుడు బీమా మొత్తాన్ని మించిపోయినా అధికంగా కూడా కొంతవరకు కవరేజ్‌ ఉంటుంది.

కచ్చితమైన వివరాలు
బీమా సంస్థకు క్లెయిమ్​ వివరాలు తెలిపేటప్పుడు మీ వ్యక్తిగత, పాలసీ వివరాలు సరిగ్గా లేకపోయినా లేదా తప్పుగా ఉన్న అలాంటి వాటిని బీమా సంస్థ తిరస్కరిస్తుంది. ఇందులో పాలసీదారుడి వయసు, ఆదాయం, వృత్తి, ప్రస్తుత బీమా పాలసీలు, ఇప్పటికే ఉన్న అనారోగ్యాలు సంబంధించిన వివరాలు ఉంటాయి. అదేవిధంగా హాస్పిటల్‌ బిల్లులు, డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్స్‌, మెడిసిన్‌ ఇన్‌వాయిస్‌లు మొదలైన వాటి గురించి పేపర్‌వర్క్‌లో ఏవైనా తప్పులుంటే బీమా సంస్థ క్లెయిమ్​ తిరస్కరిస్తుంది. అందుకే ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీ వ్యక్తిగత, పాలసీకి సంబంధించిన పత్రాలు పూర్తి చేసేటప్పుడు వీలైనంత పారదర్శకంగా, చెల్లుబాటయ్యేలా చూసుకోవడం మంచిది.

పాలసీ వ్యవధి
ఆరోగ్య బీమా పాలసీ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ పాలసీని ప్రీమియం చెల్లించి, పునరుద్ధరణ చేయించకపోతే వాటి వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే గడువు ముగిసిన పాలసీల కింద ఉంటాయి. పాలసీని సరైన సమయంలో పునరుద్ధరించుకోవడం వల్ల నిబందనలను ప్రకారం నో క్లెయిమ్​ బోనస్‌ వంటి ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల ప్రీమియం తగ్గుతుంది. అయితే, పాలసీని పునరుద్ధరణ చేసుకోకుంటే అది లాప్స్‌ అవుతుంది. బీమా క్లెయిమ్​ చేసినా తిరస్కరణకుగురువుతుంది.

సరైన క్లెయిమ్​ కోసం
ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడే మీ వివరాలు అన్నింటిని తెలిపడం ముఖ్యం. మీ ఆరోగ్య పరిస్థితులు, మునుపటి అనారోగ్యాలు, కుటుంబ వైద్య రికార్డులు, వ్యక్తిగత అలవాట్లు మొదలైన వాటికి సంబంధించి అవసరమైన అన్ని వివరాలను బహిర్గతం చేయడం మంచిది. క్లెయింను దాఖలు చేసేటప్పుడు ఎదురయ్యే అనవసరమైన సమస్యలను నివారించడంలో ఇది మీకు సాయపడుతుంది. క్లెయిమ్​ విషయంలో జాప్యం జరిగినా, క్లెయిమ్​ స్థితిని తనఖీ చేయడానికి బీమా కంపెనీ కస్టమర్‌ సర్వీస్‌ ప్రతినిధిని సంప్రదించడం మేలు.

తిరస్కరణకు గురయినప్పుడు
క్లెయిమ్​ తిరస్కరణ అన్యాయమని మీరు భావిస్తే, బీమా కంపెనీకి అప్పీల్‌ను ఫైల్‌ చేసే అవకాశం ఉంటుంది. ఈ దశలో మీ కేసును వివరిస్తూ రాతపూర్వక అభ్యర్థనను సమర్పించొచ్చు. ఒకవేళ బీమా సంస్థ మీ అప్పీల్‌ను తిరస్కరిస్తే, ఆ విషయాన్ని బీమా అంబుడ్స్‌మన్‌కు తెలియజేయొచ్చు. అంబుడ్స్‌మన్‌ అనేది పాలసీదారులు, బీమా కంపెనీల మధ్య వివాదాలను మధ్యవర్తిత్వం చేసే స్వతంత్ర సంస్థగా పనిచేస్తుంది. ఈ దశలు అన్నింటిలో మీరు విఫలం చెందితే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బీమా చట్టంలో ప్రత్యేకత కలిగిన న్యాయవాదిని సంప్రదించవచ్చు.

'పన్ను మినహాయింపు పరిమితిని రూ.5లక్షలకు పెంచాల్సిందే' - AIFTP

మీ క్రెడిట్ కార్డు పోయిందా? వెంటనే ఇలా చేయండి - లేదంటే చాలా నష్టం సుమా! - Credit Card Lost Or Stolen

ABOUT THE AUTHOR

...view details