బంగారు నగలు కొనాలా? ఆభరణాల ధరలను ఎలా లెక్కించాలో తెలుసుకోండిలా! - Gold Jewellery Cost Calculation - GOLD JEWELLERY COST CALCULATION
Gold Jewellery Cost Calculation : మీరు బంగారు ఆభరణాలు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా బంగారు నగల ధరలను ఎలా లెక్కిస్తారో తెలుసుకోవాలి. ఎందుకంటే, బంగారు ఆభరణాల క్వాలిటీలో చాలా రకాలు ఉంటాయి. ఈ విషయం తెలియక చాలా మంది నష్టపోతూ ఉంటారు. అందుకే నగలు కొనే ముందు ఫైనల్ బిల్‌ను ఏవిధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Jewellery Cost Calculation :బంగారం ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన (24 క్యారెట్) బంగారం అయితే ఏకంగా రూ.75,000 దాటేసింది. అందుకే ఆభరణాల ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. మరోకొద్ది రోజుల్లో అక్షయ తృతీయ వస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు బంగారు ఆభరణాలు కొనాలని అనుకుంటున్నారా? అయితే కచ్చితంగా మీరు ఆభరణాల విలువను ఎలా లెక్కిస్తారో తెలుసుకోవాలి. ఎందుకంటే, నగల ధరలను చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. అందులో బంగారం ఖరీదు, తయారీ ఖర్చులు, పన్నులు, హాల్ మార్కింగ్ ఛార్జీలు సహా, ఆభరణాల్లో పొదిగిన వజ్రాలు, లేదా విలువైన రాళ్ల ధరలు కూడా మిళితమై ఉంటాయి.
పసిడి ఆభరణాల ధరలు వాటిని అమ్మే నగల వ్యాపారుల బట్టి కూడా మారుతూ ఉంటాయి. ఎలా అంటే, నగల వ్యాపారులు వివిధ ప్రదేశాల నుంచిబంగారంకొంటూ ఉంటారు. వాటిని రిఫైనింగ్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా డబ్బులు ఖర్చు అవుతాయి. వాటిని కూడా బంగారు ఆభరణాల ధరలో కలిపి, బయ్యర్స్ నుంచి వసూలు చేస్తుంటారు. కనుక వీటన్నింటి గురించి మీరు తెలుసుకోవాలి.
How To Calculate Gold Jewellery Price బంగారు ఆభరణాల ధరను లెక్కించడానికి ఒక సూత్రం (ఫార్ములా) ఉంది. అది ఏమిటంటే?
ఆభరణం తుది ధర= {బంగారం ధర X (బంగారం బరువు)}+ తయారీ ఖర్చులు + 3% జీఎస్టీ + హాల్‌మార్కింగ్ ఛార్జీలు
నోట్ : బంగారం బరువును గ్రాముల్లో కొలుస్తారు.
నోట్ : బంగారం నాణ్యతను క్యారెట్లలో సూచిస్తారు. బంగారంలో 24క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్, 14 క్యారెట్ లాంటి వివిధ రకాలు ఉంటాయి. వీటిలో 24 క్యారెట్ బంగారం అనేది అత్యంత స్వచ్ఛమైనది, విలువైనది. 14 క్యారెట్ బంగారం తక్కువ ధరకు లభిస్తుంది.
మేకింగ్ ఛార్జీలు నగల వ్యాపారులు కచ్చితంగా మేకింగ్ ఛార్జీలు వసూలు చేస్తారు. కొందరు దీనిని 'వేస్టేజ్ ఛార్జీలు' అని కూడా అంటారు. దీనిని గ్రాములు లేదా శాతాల ఆధారణంగా లెక్కిస్తారు.
సాధారణంగా మేకింగ్ ఛార్జీలు అనేవి బంగారం (గ్రాము) ధరలో 1 శాతం వరకు ఉంటాయి. ఉదాహరణకు 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.68,000 అనుకుందాం. అప్పుడు ఒక గ్రాముకు 1 శాతం చొప్పున మేకింగ్ ఛార్జీలు లెక్కిస్తే, అది రూ.680లకు సమానం అవుతుంది. దీని ప్రకారం 10 గ్రాముల గోల్డ్ చైన్ చేయించడానికి మేకింగ్ ఛార్జీ రూ.6,800 అవుతుంది.
జీఎస్టీ విషయానికి వస్తే, బంగారం ధరతోపాటు, మేకింగ్ ఛార్జీలపై కూడా పన్ను విధిస్తారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, బంగారు ఆభరణాలపై హాల్ మార్క్ వేయడం తప్పనిసరి. కనుక హాల్ మార్కింగ్ ఛార్జీలు కూడా వసూలు చేస్తారు.
ఇలా లెక్కిస్తారు! ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా నగల ధరలను ఎలా లెక్కిస్తారో చూద్దాం. ఒక వ్యాపారి 22 క్యారెట్ (10 గ్రాములు) బంగారాన్ని రూ.65,000కు, 18 క్యారెట్ (10 గ్రాములు) బంగారాన్ని రూ.56,000కు విక్రయిస్తున్నాడు అనుకుందాం. ఒక వ్యక్తి 11 గ్రాముల 22 క్యారెట్ బంగారం గొలుసును, డైమెండ్ పొదిగిన 3.5 గ్రాముల 18 క్యారెట్ గోల్డ్ రింగ్‌ను కొనుగోలు చేశాడని అనుకుందాం. మేకింగ్ ఛార్జీలు గ్రాముకు రూ.500 అనుకుంటే, అప్పుడు మొత్తం బిల్లు ఎంత అవుతుందో ఇప్పుడు చూద్దాం.
గోల్డ్ చైన్ ధర :
11 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర - రూ.71,500 (రూ.6500 X 11 గ్రాములు)
మేకింగ్ ఛార్జీలు - రూ.5,500 (రూ.500 X 11 గ్రాములు)
గోల్డ్ చైన్ మొత్తం ధర - రూ.77,000 (రూ.71,500 + రూ.5,500)
జీఎస్టీ@ 3% - రూ.2,310 (3% ఆఫ్ రూ.77,000)
హాల్ మార్కింగ్ ఛార్జెస్ - రూ.45
మొత్తం బిల్లు - రూ.79,355
డైమెండ్ పొదిగిన గోల్డ్ రింగ్ ధర :
3.5 గ్రాముల 18 క్యారెట్ డైమెండ్ రింగ్ ధర - రూ.19,600 (రూ.5600 X 3.5 గ్రాములు)
మేకింగ్ ఛార్జీలు - రూ.1,750 (రూ.500 X 3.5 గ్రాములు)
వజ్రం ధర - రూ.4,500
డైమెండ్ రింగ్ మొత్తం ధర - రూ.25,850 (రూ.19,600 + 1,750 + 4,500)
జీఎస్టీ@ 3% - రూ.776 (3% ఆఫ్ రూ.25,850)
హాల్ మార్కింగ్ ఛార్జెస్ - రూ.45
మొత్తం బిల్లు - రూ.26,671
బంగారు నగలు కొనేముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు!
1. వజ్రాలు, రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు : మీరు నగలు కొనేటప్పుడు బంగారం బరువు, వజ్రాలు, రత్నాలు, మణుల(Gemstones) బరువును వేర్వేరుగా తూకం వేయించాలి. ఎందుకంటే, కొంత మంది వ్యాపారులు, అన్నింటినీ కలిపి తూకం వేసి, అన్యాయంగా అధికంగా డబ్బులు వసూలు చేస్తారు. ఇలా కొన్న నగలను మీరు మరొకరికి అమ్మాల్సి వస్తే, వాళ్లు మీకు బంగారం ధర మాత్రమే చెల్లిస్తారు. వజ్రాలు, రత్నాల ధరలను ఎట్టిపరిస్థితుల్లోనూ లెక్కించరు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి.
2. బంగారు నగల బిల్లు : బంగారం షాపు వాళ్లు ఇచ్చే బిల్లులో మీరు కొన్న నగల వివరాలు అన్నీ ఉన్నాయో, లేదో చూసుకోవాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం, బిల్లులో గోల్డ్ స్వచ్ఛత (క్వాలిటీ & ప్యూరిటీ), బరువు, బంగారంలో మిక్స్ చేసిన ఇతర లోహాల వివరాలు, హాల్‌మార్కింగ్ ఛార్జీల వివరాలు కచ్చితంగా ఉండాలి. సదరు ఆభరణంలో వజ్రాలు, రత్నాలు లాంటివి పొదిగి ఉంటే, బిల్లులో వాటి ధరలు సపరేట్గా రాస్తారు. ఈ విషయాన్ని మీరు కచ్చితంగా గమనించాలి.
3. Purity Of Gold Jewellery :బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో చెబుతుంటారు. 24 క్యారెట్ బంగారం చాలా స్వచ్ఛమైనది. కానీ దీనితో ఆభరణాలు చేయడానికి వీలుపడదు. అందుకే 22 క్యారెట్, 18 క్యారెట్, 14 క్యారెట్ బంగారంతో ఆభరణాలు చేస్తుంటారు. కొందరు వ్యాపారులు 20 క్యారెట్ బంగారంతోనూ నగలు చేస్తుంటారు.
22 క్యారెట్ బంగారు నగల్లో 91.6 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ఉంటుంది. మిగతా భాగంలో జింక్, కాపర్, సిల్వర్ లాంటి ఇతర లోహాలు ఉంటాయి. వీటి వల్ల బంగారం గట్టిగా తయారవుతుంది. ఎక్కువ కాలం మన్నిక వస్తుంది.
20 క్యారెట్ బంగారు ఆభరణంలో 83.3 శాతం స్వచ్ఛమైన పసిడి ఉంటుంది. 18 క్యారెట్ బంగారంలో 75 శాతం గోల్డ్ ఉంటుంది. మిగతా భాగంలో రాగి, వెండి, జింక్ లాంటివి ఉంటాయి.
సాధారణంగా 18 క్యారెట్, 14 క్యారెట్ బంగారంతోనే నగలు చేస్తుంటారు. ఎందుకంటే 22 క్యారెట్ బంగారం కాస్త మృదువుగా ఉంటుంది. కనుక దీనిలో వజ్రాలు పొదగడానికి వీలుండదు.
ఇక్కడ మీరొక విషయం గుర్తుంచుకోవాలి. బంగారం కాలక్రమంతో తరుగుతూ ఉంటుంది. అందుకే బంగారం కొనేవాళ్లు తరుగును తీసివేసి, మిగతా సొమ్మును చెల్లిస్తుంటారు.
4. Hallmarking On Gold Jewellery కేంద్ర ప్రభుత్వం 2021 జూన్ 16 నుంచి బంగారంపై హాల్ మార్క్ వేయడాన్ని తప్పనిసరి చేసింది. తరువాత దీనిని 2021 జులై 1లో రివైజ్ కూడా చేసింది. దీని ప్రకారం, హాల్‌మార్క్‌లో BIS లోగో, బంగారం స్వచ్ఛత/ సవ్యత (Fineness) గ్రేడ్, 6-అంకెల ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ కోడ్ (HUID) ఉండాలి. 2023 ఏప్రిల్ 1 నుంచి వ్యాపారులు HUID కోడ్ లేకుండా, బంగారు ఆభరణాలు విక్రయించకూడదని ప్రభుత్వం ఆదేశించింది.
బంగారం స్వచ్ఛత
ఫైన్నెస్ నంబర్
22 క్యారెట్
22K916
18 క్యారెట్
18K750
14 క్యారెట్
14K585
5. పాత బంగారం మార్చుకోవాలి అంటే? సాధారణంగా మనం పాత బంగారు ఆభరణాలు మార్చుకుని, కొత్త నగలు తీసుకుంటూ ఉంటాం. కనుక మీరు బంగారం కొనేటప్పుడే, ఎక్స్ఛేంజ్ పాలసీ గురించి కూడా కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే, కొంత మంది వ్యాపారులు 100 శాతం బంగారం విలువను అందిస్తారు. మరికొందరు పాత నగలు తీసుకుని కేవలం 90 శాతం విలువనే తిరిగి చెల్లిస్తుంటారు. అలాగే ఆభరణాలు కొనేముందు వజ్రాలు, రత్నాలకు రీసేల్ వాల్యూ ఉందో, లేదో తెలుసుకోవాలి.