Gas Cylinder Price Today :గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.30.50 వరకు తగ్గించాయి. దీంతో దిల్లీలో దీని ధర రూ.1764.50కు చేరుకుంది. అలాగే 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ ధర కూడా రూ.7.50కు తగ్గింది. తగ్గిన ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
నేటి నుంచి (ఏప్రిల్ 1)కొత్త ఆర్థిక ఏడాది షురూ అయ్యింది. దీనితో అనేక కొత్త ఆర్థిక నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక సాధారణంగా ప్రతినెలా ఒకటో తేదీన, 15వ తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయన్న సంగతి తెలిసిందే. సిలిండర్ ధరలను పెంచడం లేదా తగ్గించడం లేదా స్థిరంగా ఉంచడం లాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. తాజాగా ఒకటో తేదీన గుడ్ న్యూస్ చెప్పాయి చమురు సంస్థలు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ30.50 వరకు తగ్గించాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. దీంతో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర దేశ రాజధాని దిల్లీలో రూ.1764.50కు చేరింది. అంతకుముందు ధర రూ.1795గా ఉండేది.
వాణిజ్య గ్యాస్ ధరలు దేశంలోని ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే?
- కోల్‌కతా రూ.1879
- ముంబై రూ.1717
- చెన్నై రూ.1930
- హైదరాబాద్ రూ.2027 ఉండేది. ఇప్పుడు దీనిపై రూ.30.50 తగ్గింది.
గత కొన్నాళ్లుగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇంట్లోని వంటగ్యాస్ ధరలు తగ్గిస్తున్నా, కమర్షియల్ సిలిండర్ ధరలను మాత్రం పెంచుకుంటూ పోయాయి చమురు సంస్థలు. వాణిజ్య సిలిండర్లను బయట షాపుల్లో వినియోగిస్తారు. కాబట్టి హోటల్స్‌లో, ఫుడ్ కోర్టుల్లో తయారు చేసే ఆహార పదార్థాల ధరలు స్వల్పంగా తగ్గే ఛాన్స్ ఉంది.