FIRE Strategy :ప్రస్తుత కాలంలో ఎప్పుడు ఎలాంటి ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఏర్పడతాయో చెప్పలేకపోతున్నాం. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని సక్రమ పద్ధతుల్లో మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం సరైన బడ్జెట్ వేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ బడ్జెట్లో దైనందిన ఖర్చులు, పొదుపు, మదుపు, పదవీ విరమణ ప్రణాళికలకు అవసరైన కేటాయింపులు చేసుకోవాలి. అలాగే కచ్చితంగా అత్యవసర నిధిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే భవిష్యత్లో మీకు ఆర్థిక భద్రత కలుగుతుంది.
ప్రస్తుతం వడ్డీ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలు కూడా మితిమీరిపోతున్నాయి. అందుకే ఇప్పటి నుంచే పదవీ విరమణ ప్రణాళికలు వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే, ఉద్యోగం చేస్తున్నప్పుడు లేదా పని చేసేటప్పుడు సరైన ఆర్థిక ప్రణాళిక వేసుకోకుంటే, పదవీ విరమణ తరువాత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వీలైనంత త్వరగా రిటైర్మెంట్ ప్రణాళిక వేసుకోవాలి. ఇందుకోసం ఉపయోగపడేదే ఫైర్ (FIRE) స్ట్రాటజీ.
What Is FIRE Strategy?
ఫైర్ స్ట్రాటజీ - 30:30:30:10 సూత్రాన్ని ప్రతిపాదిస్తుంది. ఇది మీ ఆదాయ నిర్వహణ, పెన్షన్ ప్లానింగ్ రెండింటికీ వర్తిస్తుంది. ఫైర్ స్ట్రాటజీ ప్రకారం, మీ మొత్తం ఆదాయంలో 30 శాతాన్ని రోజువారీ ఖర్చులకు కేటాయించాలి. మరో 30 శాతాన్ని పెట్టుబడులకు, ఇంకో 30 శాతాన్ని పదవీ విరమణ ప్రణాళికకు కేటాయించాలి. మిగిలిన 10 శాతం డబ్బుతో అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మీ భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలు ఎలాంటి ఆటంకం లేకుండా నెరవేరుతాయి.
మీ రోజువారీ అవసరాలను, దీర్ఘకాలిక లక్ష్యాలను సమతుల్యం చేసుకోవడానికి ఈ ఫైర్ స్ట్రాటజీ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫైర్ స్ట్రాటజీ వల్ల మీ ఆర్థిక అలవాట్లు మారుతాయి. మీ ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది.