Financial Resolutions For 2024-25 :ఈఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చాలా మంది సరికొత్త ఆర్థిక లక్ష్యాలు ఏర్పరుచుకుంటారు. మరి ఈ ఆర్థిక లక్ష్యాలు ఎలా ఉండాలి? వీటిని నెరవేర్చుకోవడానికి ఏం చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా ప్రారంభించండి
పొదుపు, పెట్టుబడులు అనేవి ఏదో ఒక రోజు ప్రారంభించక తప్పదు. మీకు ఆదాయం తక్కువగా ఉందని ఖర్చులు అయితే ఆగవు కదా? ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మనం సంపాదిస్తున్న దానిలో కొంచెం పెట్టుబడుల కోసం కేటాయించాలి. అది ఈ ఏప్రిల్ 1 నుంచే ప్రారంభించడం మంచిది.
ఆర్ధిక స్థితి
మీ నికర విలువ ఎంతో మీకు తెలుసా? మీకున్న ఆస్తులు, బాధ్యతల మధ్య వ్యత్యాసమే ఈ నికర విలువ. ఆదాయంలో నుంచి ఎంత డబ్బును ఖర్చు చేస్తున్నారు. మీరు ఏ స్థాయిలోనే జీవిస్తున్నారు? అనే అంశాలు మీ ఆర్థిక స్థితిని తెలియజేస్తాయి. పొదుపు, పెట్టుబడుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నికర విలువ అధికంగా ఉంటే ఆర్థికంగా మీరు బాగున్నట్లు లెక్క.
లక్ష్యాలను గుర్తించండి!
ఆర్థిక లక్ష్యాలు అనేవి అవసరాలు, కోరికల రూపంలో ఉంటాయి. వాటిని వాస్తవ రూపంలోకి మారేందుకు డబ్బు అవసరం ఉంటుంది. సొంత ఇల్లు, కారు కొనడం, పిల్లల చదువులు, వారి వివాహం, పదవీ విరమణ ఇవన్నీ కూడా సాధారణ ఆర్థిక లక్ష్యాల కిందకే వస్తాయి. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరుచుకుని, అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలి.
అలస్యం చేయకూడదు
పెట్టుబడుల విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. తొందరగా పెట్టుబడులను ప్రారంభిస్తే, చక్రవడ్డీ ప్రభావంతో వేగంగా ఆర్థిక వృద్ధి సాధించవచ్చు. పీపీఎఫ్ లాంటి వాటిలో ఏప్రిల్ 1లోపు పెట్టుబడి పెట్టడం మంచిది. కనీసం రూ.1000తోనైనా పెట్టుబడులు ప్రారంభించాలి. వచ్చే 5 ఏళ్లపాటు భారత ఆర్థిక వృద్ధి సానుకూలంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. గనుక ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.