Financial Documents For Couples : ఆర్థిక అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఎవ్వరూ చెప్పలేం. అందుకని ఈ విషయంలో అజాగ్రత్త వహించకుండా ముందు నుంచే కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. ముఖ్యంగా పెళ్లైన దంపతులు వీటి విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లైన కొత్త కపుల్‌తో పాటు ఇప్పటికే పెళ్లైన వారు భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా కొన్ని విలువైన ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్‌ను భద్రపరుచుకోవాలని అంటున్నారు. మరి తప్పనిసరిగా ఉండాల్సిన ఆ ఆర్థిక పత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.
What Are The Most Important Documents To Have :
జాయింట్ బ్యాంక్ అకౌంట్
సాధారణంగా కుటుంబ సభ్యులు పొదుపు కోసం లేదా ఏదైన స్వల్పకాలిక ఆర్థిక లక్ష్య సాధన కోసం ఉమ్మడి లేదా జాయింట్ బ్యాంకు ఖాతాలను తెరుస్తారు. ఇతర రెగ్యులర్ ఖాతాల మాదిరే ఇక్కడా పొదుపు ఖాతాతో పాటు లోన్ అకౌంట్, మార్జిగేజ్ అకౌంట్ ఇలా కొన్ని రకాల ఉమ్మడి ఖాతాలను తెరవచ్చు. ఈ ఖాతా ప్రారంభించేందుకు భాగస్వాములు ఇద్దరు తప్పనిసరిగా బ్యాంకు శాఖలో హాజరు కావాల్సి ఉంటుంది. ఈ రకమైన అకౌంట్‌ను నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో మీరు అనేక ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అందుకని దంపతుల మధ్య ఈ సాధారణమైన జాయింట్ బ్యాంక్ ఖాతా ఉండడం ఉత్తమం. ఇందులో అనేక రకాల జాయింట్ ఖాతాలు ఉంటాయి. హక్కులు, బాధ్యతలు ఇద్దరికీ సమానంగా ఉండే అకౌంట్లను తెరిస్తే భవిష్యత్తులో ఎటువంటి పొరపచ్చాలు రాకుండా ఉంటాయి. వీటిని తీసుకునేముందు ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా ఆలోచించడం మంచిది.
విల్ అండ్ టెస్టమెంట్
విల్ అండ్ టెస్టమెంట్- ఈ చట్టపరమైన పత్రాన్ని ప్రతి ఒక్క కపుల్ కలిగి ఉండాలి. మీ మరణానంతరం మీకు సంబంధించిన ఆస్తులు, ఆర్థిక వనరులు ఎవరికి చెందాలి, వాటిని వారికి ఎలా పంచాలి అనే వివరాలను తెలియజేస్తూ ఈ పత్రాన్ని తయారు చేస్తారు. ఇలా చేయడం ద్వారా మీ పార్ట్నర్ కోరికలను మీరు గౌరవించినవారు అవుతారు. అలాగే మీకు కావాల్సిన వారు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చూసినట్లవుతుంది.
మ్యారేజ్ సర్టిఫికేట్
మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా వివాహ ధ్రువీకరణ పత్రం ప్రతి జంటకు ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా భారత్‌లో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సర్టిఫికేట్ మీ వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తిస్తుంది. జాయింట్ అకౌంట్ ఓపెనింగ్, బీమా పాలసీల కోసం దరఖాస్తు, ఉమ్మడి రుణాలు పొందడం వంటి వివిధ ఆర్థిక విషయాల్లో ఈ ధ్రువపత్రం ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని కలిగి ఉండటమే కాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండడం ఉత్తమం.