Financial Deadlines In March 2024 :మరికొద్ది రోజుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అంతకంటే ముందు ఈ మార్చి నెలలో పలు కీలక ఆర్థిక అంశాల గడువు ముగుస్తోంది. వాటిని సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే ఆ ఫైనాన్సియల్ డెడ్‌లైన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ ఫ్రీ అప్డేట్కు చివరి తేదీ :చాలా ఏళ్లుగా ఎవరైతే ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోలేదో, వారు మార్చి 14లోపు ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అవకాశం కల్పించింది. ఆధార్ సంబంధిత మోసాలను నివారించడానికి ఇది తప్పనిసరి. ఒక వేళ ఈ గడువులోగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే, తరువాత నుంచి ఆధార్ అప్డేట్ కోసం అదనపు ఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ డెడ్‌లైన్
పేటీఎం పేమెంట్ బ్యాంక్ కస్టమర్లు తమ నగదును ఇతర బ్యాంకుల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు ఆఖరు తేదీ మార్చి 15. ఒక వేళ గడువులోగా మీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఉన్న డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకోకపోతే, ఆ తరువాత డబ్బు జమ చేసుకోవడం, క్రెడిట్ ట్రాన్షాక్షన్స్ చేయడానికి అవకాశం ఉండదు.
నాలుగో విడత అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ : 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, నాలుగో విడత అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేసేందుకు ఆఖరు తేదీ మార్చి 15.
ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్లు :ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్లు చేసేందుకు మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఈ తేదీలోగా ఇన్వెస్ట్మెంట్లు చేస్తే, పన్ను ఆదా కావడానికి అవకాశం ఉంటుంది.