Emergency Fund Vs Personal Loan : ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎప్పుడో ఒకప్పుడు అత్యవసరంగా డబ్బులు అవసరం అవుతాయి. ఈ అవసరాలకు మన దగ్గర డబ్బు లేనప్పుడు, అత్యవసర నిధిని వినియోగించాలా? లేదా వ్యక్తిగత రుణం తీసుకుని ఆ ఖర్చులను సర్దుబాటు చేసుకోవాలా? అనే సందేహం చాలా మందికి వస్తుంది. మరి ఇలాంటి సందర్భాల్లో ఏది ఎంచుకోవాలి? దాని వల్ల కలిగే లాభనష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అత్యవసర నిధి
When To Use Emergency Fund : అత్యవసర నిధి అనేది ఊహించని ఖర్చులు లేదా ఆర్థిక అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు మనల్ని ఆదుకుంటుంది. ఈ అత్యవసర నిధులు సాధారణంగా బ్యాంకు పొదుపు ఖాతాలో లేదా లిక్విడ్ ఫండ్ల వంటి సులభంగా యాక్సెస్ చేయగల ఖాతాలలో ఉండడం మంచిది. అత్యవసర నిధి అనేది ఊహించని పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం రుణాలపాలు కాకుండా కాపాడుతుంది. అందుకే 6 నుంచి 12 నెలలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. సొంత నిధి కాబట్టి, అత్యవసర పరిస్థితుల్లో నగదు అవసరం ఏర్పడినప్పుడు దానిని మీరు వాడుకోవచ్చు. కనుక అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేయనక్కరలేదు. కనుక క్రెడిట్ స్కోరుతో కూడా ఉండదు. కానీ, కొన్నిసార్లు ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నిధి సరిపోకపోవచ్చు. మీ అత్యవసర నిధిలో ఎంత నగదు నిల్వ ఉంది? ఎలాంటి ఖర్చులకు సరిపోతుందనేది చాలా కీలకం. అత్యవసర నిధిని ఉపయోగించడం వల్ల రుణ బాధ్యత ఉండకపోయినప్పటికీ, ఏదైనా కారణం చేత దాని నుంచి కొంత నగదు వాడుకున్నప్పుడు, వీలైనంత త్వరగా ఆ నిధిని మళ్లీ పునరిద్ధరించుకోవడం మంచిది.
అత్యవసర నిధిని ఏ అవసరాలకు వాడాలి?
- వైద్య ఖర్చులు : ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ ఖర్చులు గణనీయంగా పెరిగిపోయాయి. భవిష్యత్‌లో మరింతగా పెరిగిపోతాయి. కనుక ఊహించని వైద్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, అత్యవసర నిధి మీకు భరోసానిస్తుంది.
- ఉపాధి కోల్పోవడం : ఒక్కోసారి స్వల్పకాలం పాటు మనం ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోవచ్చు. లేదా ఆదాయం తగ్గిపోవచ్చు. ఇలాంటప్పుడు మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చేవరకు అత్యవసర నిధిని ఉపయోగించుకోవచ్చు.
- రిపేర్లు : హఠాత్తుగా కారు రిపేరు కావచ్చు. లేదా ఇంటికి అత్యవసర మరమ్మతులు లాంటివి చేయాల్సి రావచ్చు. ఇలాంటి అవసరాలను తప్పించుకోవడానికి వీలుండదు. వీటి ఖర్చుల కోసం లోన్ తీసుకోకుండా అత్యవసర నిధిని వాడవచ్చు.
- కుటుంబ అవసరాలు : కొన్ని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు గానీ, బంధువులకు గానీ తీవ్ర ప్రమాదాలు, మరణం లాంటివి సంభవించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా డబ్బులు అవసరం అవుతాయి. ఇలాంటి ఖర్చులను తప్పించుకోవడానికి వీలుండదు. కనుక, వీటికి అత్యవసర నిధిని ఉపయోగించుకోవచ్చు.
వ్యక్తిగత రుణం
When To Take A Personal Loan : బ్యాంకులు క్రెడిట్ స్కోర్ ఆధారంగా వ్యక్తిగత రుణాలు ఇస్తుంటాయి. మన దగ్గర అత్యవసర నిధి లేనప్పుడు లేదా ఉన్న నిధి సరిపోనప్పుడు పర్సనల్ లోన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత రుణాలను బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, వివిధ ఆన్‌లైన్ రుణ సంస్థల వద్ద తీసుకోవచ్చు. గృహ, కారు రుణాల మాదిరిగా కాకుండా, పర్సనల్ లోన్స్‌ను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వీటిపై విధించే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండాయి. రీపేమెంట్ నిబంధనలు కూడా కాస్త కఠినంగా ఉంటాయి. మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్నవారికి మాత్రమే బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇస్తాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కూడా ఈ రుణాలు లభిస్తున్నాయి. ఈ రుణాన్ని ఎలాంటి ఖర్చులకయినా ఉపయోగించుకోవచ్చు. రుణాన్ని తీర్చడానికి ఈఎంఐ సౌకర్యం కూడా ఉంటుంది. కానీ సకాలంలో రుణం తీర్చకపోతే భారీ జరిమానాలుంటాయి. పైగా క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. అందుకే వ్యక్తిగత రుణాన్ని ఎంచుకున్నప్పుడు, మీ ఆదాయం ఎంత స్థిరంగా ఉందనేది చూడాలి. స్థిరమైన ఆదాయం ఉన్నప్పుడు లోన్ తిరిగి చెల్లించడం సులభం అవుతుంది.