మళ్లీ ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ - ఆసియా నంబర్ వన్‌గా ముకేశ్ అంబానీ! - World Richest Person Elon Musk
Elon Musk Is The World's Richest Person Again : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మళ్లీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి, నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీని వెనక్కు నెట్టి, మళ్లీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు.
Elon Musk Is The World's Richest Person Again :ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం, ఎలాన్ మస్క్ 208 బిలియన్ డాలర్ల నికర విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 205 బిలియన్ డాలర్లతో రెండో స్థానానికి పడిపోయారు. 199 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ ఆర్నాల్డ్ మూడో స్థానాల్లో నిలిచారు. వాస్తవానికి చాలా కాలం నుంచి ఈ ముగ్గురి మధ్య గట్టి పోటీ నడుస్తోంది. అయితే టెస్లా షేర్లు రాణించిన నేపథ్యంలో మస్క్ సంపద అమాంతం పెరిగింది. దీనితో ఆయన జెఫ్ బెజోస్ వెనక్కు నెట్టి తిరిగి మొదటి స్థానం దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన టెస్లా సాధారణ వార్షిక సమావేశంలో, ఎలాన్ మస్క్‌కు 56 బిలియన్ డాలర్ల భారీ వేతన ప్యాకేజీని ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు అంగీకరించారు. దీనితో ఆయన కంపెనీ షేర్లు భారీ స్థాయిలో లాభపడ్డాయి.
ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీని వెనక్కు నెట్టి ముకేశ్ అంబానీ మొదటి స్థానానికి చేరుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, ముకేశ్ అంబానీ 113 బిలియన్ డాలర్ల సంపదతో, ప్రపంచ కుబేరుల జాబితాలో 13వ స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ 108 బిలియన్ డాలర్ల సంపదతో 14వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, గతంలో 12వ స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ ఇప్పుడు 13వ స్థానానికి దిగజారారు. అదానీ 11వ స్థానం నుంచి 14వ స్థానానికి పడిపోయారు.