తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక సర్వే అంటే ఏంటి? ఎవరు తయారు చేస్తారు? ఎందుకంత ప్రాధాన్యం? - ఆర్థిక సర్వే అంటే ఏంటి

Economic Survey Meaning : పార్లమెంట్​లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో మనకు వినిపించే మరో పదం 'ఆర్థిక సర్వే'! దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే ఈ సర్వేలో ఏముంటుంది? దీని ప్రాధాన్యం ఏంటి? ఈ సర్వేను ఎవరు తయారు చేస్తారు అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం పదండి.

economic survey 2024
economic survey 2024

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 5:51 PM IST

Economic Survey Meaning :దేశ ఆర్థిక వ్యవస్థ గత ఏడాది కాలంలో ఎలాంటి పనితీరును కనబర్చింది, రాబోయే సంవత్సరంలో ఎలాంటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కోనుందనే విషయాలను అంచనా వేసి చెప్పేదే ఎకనామిక్ సర్వే. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది దిశానిర్దేశం చేస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సర్వేను ( Economic Survey 2024 ) రూపొందిస్తుంది. రానున్న రోజుల్లో దేశం ముందు ఎలాంటి సవాళ్లు పొంచి ఉన్నాయి? వాటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? అనే అంచనాలను ముందుగానే వెలువరించి సూచనలు ఇస్తుంది. సాధారణంగా కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు ఆధ్వర్యంలో ఈ నివేదిక ( Economic Survey Is Published By ) రూపొందిస్తారు. ఈ ఆర్థిక సర్వేను ఆధారంగా చేసుకొని ఏటా బడ్జెట్​ను సిద్ధం చేస్తారు.

సర్వేలో ఏముంటుంది?
బడ్జెట్‌ రూపకల్పనలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఆర్థిక సర్వే. దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. దేశ ఆర్థిక పరిస్థితులను మాత్రమే తెలియజేయడం కాకుండా ప్రధాన రంగాలైన వ్యవసాయ, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, విదేశీ మారక నిల్వలు, ఎగుమతి దిగుమతులు, నగదు చలామణి, ధరల పెరుగుదల, ఉద్యోగాలు వంటి అంశాలను కూడా వివరిస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల స్థితిగతులు, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, వాటి వల్ల వస్తున్న ఫలితాలను సైతం ఆర్థిక సర్వే విశ్లేషిస్తుంది. వచ్చే ఏడాది ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, వాటిని ఎదుర్కొనేందుకు పాటించాల్సిన వ్యూహాలను కూడా సూచిస్తుంది. కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యం ఉంటుంది.

బడ్జెట్‌కు దీనికి తేడా ఏంటి?
కేంద్ర బడ్జెట్​లో వివిధ రంగాలకు సంబంధించిన రాబడి, ఖర్చుల కేటాయింపుల గురించి పేర్కొంటారు. కానీ ఆర్థిక సర్వేలో లోతైన విశ్లేషణలు ఉంటాయి. ప్రస్తుత సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లు, చేపట్టాల్సిన సంస్కరణల గురించి ఇందులో ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అందుకే, ఈ సర్వే ఆధారంగా కేంద్ర బడ్జెట్ రూపొందిస్తారు.

తొలిసారి ఎప్పుడు?
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్​ ముందుకు తీసుకొస్తారు. ఇది ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఆర్థిక సర్వేను 1950-51 ఆర్థిక సంవత్సరంలో పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. 1964 వరకు సాధారణ బడ్జెట్​తోనే దీన్ని ప్రవేశపెట్టేవారు. 1964 తర్వాత బడ్జెట్ కన్నా ముందే దీన్ని పార్లమెంట్ ముందుకు తీసుకొస్తున్నారు. ముందుగా విడుదల చేయడం వల్ల కేంద్ర బడ్జెట్​లో చేసే కేటాయింపుల ప్రతిపాదనలను తేలికగా అర్థం చేసుకోవచ్చు.

ఈసారి ఉంటుందా?
తాత్కాలిక బడ్జెట్​కు ముందు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టడం పార్లమెంట్ సంప్రదాయం కాదు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వమే సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెడుతుంది. జూన్- జులై నెలల్లో మిగిలిన ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ కూడా కొత్త ప్రభుత్వమే పార్లమెంట్​కు సమర్పిస్తుంది. అయితే, ఈ సారి ఆర్థిక సర్వే తరహాలో దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే సంక్షిప్త నివేదికను కేంద్రం విడుదల చేసే ఛాన్స్ ఉంది. జీడీపీ వృద్ధి, అంచనాలు, చమురు ధరలను ఇందులో ప్రస్తావించవచ్చని తెలుస్తోంది.

మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి? దీన్ని ఎప్పుడు, ఎందుకు ప్రవేశపెడతారు?

హల్వా వేడుకలో నిర్మల- ఈ 'బడ్జెట్' సంప్రదాయం వెనుక అసలు కారణం తెలుసా?

ABOUT THE AUTHOR

...view details