Credit Card Reward Points :గత కొన్నేళ్లలో మనదేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగిపోయింది. చాలామంది క్రెడిట్ కార్డులతో ప్రతినెలా విద్యుత్, టెలిఫోన్, వైఫై, నల్లా, ఇంటి పన్ను వంటివన్నీ కట్టేస్తుంటారు. మరుసటి బిల్లింగ్ తేదీ వచ్చేలోగా ఆ మొత్తాన్ని క్రెడిట్ కార్డులోకి సర్దుబాటు చేస్తుంటారు. ఈ విధంగా పొదుపుగా క్రెడిట్ కార్డును వాడుకుంటే ఆకర్షణీయమైన రివార్డ్ పాయింట్స్ వస్తాయి. వాటిని రీడీమ్ చేసుకొని క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్, కాంప్లిమెంటరీ ట్రావెల్ వంటి ప్రయోజనాలను యూజర్లు పొందొచ్చు. చాలామంది క్రెడిట్ కార్డుల వినియోగదారులు రివార్డు పాయింట్లు ఎక్స్‌పైరీ గురించి ఆందోళనగా ఉంటారు. వాటిని ఎలా యాక్టివ్‌గా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ ఏమిటి?
మనం క్రెడిట్ కార్డు ద్వారా ఎంతమేర ఖర్చులు/చెల్లింపులు చేస్తామో అంతమేర రివార్డు పాయింట్లు వస్తుంటాయి. ఈ రివార్డు పాయింట్లను వివిధ అవసరాల కోసం రీడీమ్ చేసుకొని వాడుకోవచ్చు. ట్రావెల్ బుకింగ్స్, మర్చండైజ్‌లు, క్యాష్ బ్యాక్‌లను పొందే క్రమంలో వీటిని రీడీమ్ చేసేయొచ్చు. కొన్నిసార్లు మనకు వచ్చే రివార్డు పాయింట్లకు ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. ఆలోగా వాటిని రీడీమ్ చేయాలి. అందుకే రివార్డు పాయింట్ల ఎక్స్‌పైరీ తేదీలను కూడా మనం చెక్ చేసుకోవాలి. తద్వారా వాటి నుంచి లభించే ప్రయోజనాలు చేజారవు.
రివార్డు పాయింట్లు ఎందుకు ఎక్స్‌పైర్ అవుతాయి?
బ్యాంకులే రివార్డు పాయింట్లకు ఎక్స్‌పైరీ తేదీలను కేటాయిస్తాయి. వాటిని సాధ్యమైనంత త్వరగా రీడీమ్ చేసుకునేలా క్రెడిట్ కార్డుల యూజర్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ తేదీలను నిర్ణయిస్తాయి. యూజర్లకు రివార్డు పాయింట్ల కేటాయింపు వల్ల బ్యాంకులపైనే అదనపు ఆర్థిక భారం పడుతుంది. అయితే వాటిని రీడీమ్ చేసుకునే క్రమంలో యూజర్లు చేసే లావాదేవీలు బ్యాంకులకు లాభాలను అందిస్తాయి.