Disadvantages Of Multiple Credit Cards : ఈ రోజుల్లో ఒకటికి మించి క్రెడిట్ కార్డులు తీసుకోవడం చాలా సర్వసాధారణం అయిపోయింది. మీ అవసరాలు, సౌలభ్యం మాట ఎలా ఉన్నా, వీటిని నిర్వహించడంలో కాస్త అజాగ్రత్తగా ఉన్నా, రుణాల ఊబిలో చిక్కుకోవడం ఖాయం. అందుకే క్రెడిట్ కార్డులను ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పరిమితి మించకుండా!
మీ దగ్గర రెండు, మూడు క్రెడిట్ కార్డులు ఉంటే, ఆర్థికంగా కాస్త భరోసా ఉంటుంది. కానీ, వీటితో ఆదాయానికి మించి ఖర్చులు చేయకూడదు. మీ అత్యవసరాల కోసం, కార్డ్ పరిమితి మేరకు మాత్రమే దానిని వాడుకోవాలి. ప్రధానంగా క్రెడిట్ కార్డ్‌ను ఒక పక్కా ప్రణాళికతో వాడుకోవాలి. సకాలంలోనే ఈఎంఐ బిల్లులు చెల్లించాలి. క్రెడిట్ కార్డ్‌తో బిల్లుల చెల్లింపు, నిత్యావసరాల కొనుగోలు లాంటివి చేయవచ్చు. కానీ వాటిని సరదా ఖర్చులు కోసం ఉపయోగించుకోకూడదు.
హెచ్చరిక సందేశం!
మీరు క్రెడిట్ కార్డ్ వాడిన ప్రతిసారీ, జరిగిన లావాదేవీకి సంబంధించిన సందేశం (మెసేజ్) వచ్చేలా చూసుకోవాలి. బిల్లు చెల్లింపు గడువును తెలిపే రిమైండర్ మెసేజ్‌లను ఎనేబుల్ చేసుకోవాలి. అంతేకాదు పరిమితికి మించి క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు హెచ్చరిక సందేశం వచ్చేలా చూసుకోవాలి.
సకాలంలో బిల్లులు చెల్లించాల్సిందే!
మీ దగ్గర చాలా క్రెడిట్ కార్డులు ఉంటే, గడువులోగా బిల్లు చెల్లించడం కష్టమయ్యే అవకాశం ఉంది. లేదా గడువు తేదీలను మరిచిపోయే ప్రమాదం ఉంది. అందుకే మీ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా, గడువు తేదీకి ఒక రోజు ముందే బిల్లు చెల్లింపు జరిగేలా ఆటోమేట్ చేసుకోవాలి. దీని వల్ల అదనపు రుసుము, వడ్డీల భారం తగ్గుతుంది. ఒక వేళ సకాలంలో బిల్లు చెల్లించకపోతే, అదనపు వడ్డీలు, రుసుములు చెల్లించాల్సి వస్తుంది. పైగా మీ క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది.
అవసరం లేకపోతే వద్దు!
మీ దగ్గర 2 లేదా 3 క్రెడిట్ కార్డులు ఉన్నా ఫర్వాలేదు. కానీ బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని అదనంగా క్రెడిట్ కార్డులు తీసుకోవడం మంచిది కాదు. దీని వల్ల అనవసరపు ఖర్చులు, రుసుములు ఎక్కువ అవుతాయి. మీకు తెలియకుండానే రుణాలు పెరిగిపోతాయి. దీని వల్ల మీరు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఏర్పడుతుంది.
స్టేట్మెంట్లను పరిశీలించాల్సిందే!
మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లను కచ్చితంగా క్రమం తప్పకుండా పరిశీలించాలి. ఏవైనా అనధికారిక లావాదేవీలు జరిగినట్లు గుర్తిస్తే, వెంటనే ఆ విషయాన్ని సదరు బ్యాంకుకు లేదా కార్డ్ జారీ చేసిన సంస్థకు తెలియజేయాలి.