DA Hike 2024 : కేంద్ర ప్రభుత్వం ఈమార్చి నెలలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను 4 శాతం పెంచవచ్చని సమాచారం. ఇదే జరిగితే డీఏ, డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) రెండూ కలిపి బేసిక్ సాలరీలో 50 శాతానికి మించిపోతాయి.
సీపీఐ డేటా ఆధారంగా
పారిశ్రామిక కార్మికుల కోసం రూపొందించిన వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ డేటా) ఆధారంగా ఈ డియర్నెస్ అలవెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటుంది. ప్రస్తుతం సీపీఐ 12 నెలల సగటు డేటా 392.83గా ఉంది. దీనిని బట్టి లెక్కవేస్తే, డియర్నెస్ అలవెన్స్ అనేది ప్రాథమిక వేతనంలో 50.26 శాతంగా ఉంటుంది.
డీఏ & డీఆర్
కార్మిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పని చేసే లేబర్ బ్యూరో 'సీపీఐ' డేటాను నెలవారీగా ప్రచురిస్తూ ఉంటుంది. దీని ఆధారంగానే డీఏ & డీఆర్‌లను కేంద్రం ప్రకటిస్తూ ఉంటుంది. డియర్నెస్ అలవెన్స్ అనేది ఉద్యోగులకు చెల్లించే జీవన వ్యయ సర్దుబాటు భత్యం. డియర్నెస్ రిలీఫ్ అనేది పెన్షనర్లకు అందించే జీవన వ్యయ సర్దుబాటు భత్యం.
సాధారణంగా జనవరి, జులై నెలల్లో ఈ డీఏ సెమీ-ఆన్యువల్ రివ్యూ చేస్తుంటారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వీటి ఆధారంగా ఎంత మేరకు డీఏ, డీఆర్ పెంచాలో నిర్ణయిస్తారు.