Good Credit Score Benefits :మీకు మంచి క్రెడిట్/ సిబిల్ స్కోర్ ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్. మీకు తక్కువ వడ్డీకే ఈజీగా బ్యాంక్ లోన్స్ లభిస్తాయి. ఇన్సూరెన్స్ ప్రీమియంపై డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. అంతే కాదు BFSI సెక్టార్‌లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
తక్కువ వడ్డీకే లోన్
మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు చాలా సులువుగా పర్సనల్ లోన్ , హోమ్ లోన్, కార్ లోన్స్ అందిస్తాయి. అంతేకాదు తక్కువ వడ్డీ రేటుకే రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి.
మంచి క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్థిక చరిత్రను, రుణం తీర్చగలిగే సామర్థ్యాన్ని, మీ ఆర్థిక స్థిరత్వాన్ని, బాధ్యతలను తెలుపుతుంది. వీటిని ఆధారంగా చేసుకుని బ్యాంకులు - తాము ఇచ్చే రుణాలపై 20 bps - 80 bps వరకు వడ్డీ తగ్గించే అవకాశం ఉంటుంది. (bps = బేసిస్ పాయింట్స్)
ఇన్సూరెన్స్ ప్రీమియంపై డిస్కౌంట్
క్రెడిట్ స్కోర్ 800కు పైగా ఉంటే - బ్యాంకులు చాలా సులువుగా కారు/ బైక్, హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తాయి. అంతేకాదు వాటి ప్రీమియంలపై డిస్కౌంట్స్ కూడా ఇస్తాయి. ఆయా బ్యాంకులను బట్టి ఈ డిస్కౌంట్ 5% - 15% వరకు ఉంటుంది.
క్రెడిట్ స్కోర్ ఆధారంగా వ్యక్తుల రిస్క్ అసెస్మెంట్‌ను తెలుసుకోవచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బీమా సౌకర్యం కల్పించినా పెద్దగా రిస్క్ ఉండదని బ్యాంకులు భావిస్తాయి. కనుక బీమా ప్రీమియంలపై మంచి డిస్కౌంట్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తాయి.
క్రెడిట్ కార్డ్ అఫ్రూవల్
మీ క్రెడిట్ స్కోర్ 750 - 800 పాయింట్ల మధ్య ఉంటే, బ్యాంకులు మీకు కొత్త క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి ఇష్టపడతాయి. అంతేకాదు హయ్యర్ క్రెడిట్ లిమిట్‌తో, తక్కువ వడ్డీ రేటుతో, మంచి రివార్డ్స్, బెనిఫిట్స్‌తో ప్రీమియం క్రెడిట్ కార్డులు కూడా అందిస్తాయి.