Common Mistakes That Ruin The Car Paint : మనలో చాలామంది మంచి కారు కొనుక్కోవాలని ఆశపడతారు. రేయింబవళ్లు కష్టించి పనిచేసి సంపాదించిన ఓ మంచి కారు కొనుక్కుంటారు. ఇలా రూపాయి, రూపాయి పోగేసి కొనుకున్న కారును ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే చాలా మంది కారు మెయింటెనెన్స్ చేయడం ఎలానో తెలియక తికమకపడుతూ ఉంటారు. పైగా తిలియక కొన్ని చిన్నచిన్న పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల కారుపై గీతలు పడుతుంటాయి. దీనితో వారి మనస్సు బాధపడుతుంది. ర్యాష్ డ్రైవింగ్, చెట్ల ఆకులు తగిలి గీతలు పడితే ఎవరూ ఏం చేయలేరు. కానీ పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన కారుపై ఎలాంటి గీతలు పడకుండా, పెయింట్ పోకుండా చూసుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- కారుపై వస్తువులను ఉంచకూడదు
చాలామంది కారు బోనెట్‌పైనా, టాప్‌పైనా చేతిలో ఉన్నవస్తువులును ఉంచుతుంటారు. దీనివల్ల కారు పెయింటింగ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కారు కీ చైన్ వల్ల కూడా పెయింట్పోయి, కారుపై గీతలు పడే ప్రమాదం ఉందని గమనించాలి. చాలా మంది ఏ షాపింగ్‌కో, ఇంకోచోటికో వెళ్లినప్పుడు, అక్కడ కొనుగోలు చేసిన వస్తువులను ఓ కవర్‌లో పెట్టి తీసుకువస్తారు. కారు వద్దకు వచ్చి ఆ లగేజిని కారులో పెట్టేముందు, కారు ముందుభాగంపైనో, లేక కారుపై భాగంపైనో ఆ వస్తువులను ఉంచుతారు. దీనివల్ల రాపిడి జరిగి కారుపై గీతలు పడుతుంటాయి. అదే విధంగా మెటల్ కీచైన్ కారుపై ఉంచడం వల్ల మనకు తెలియకుండానే గీతలు పడుతుంటాయి. కనుక కారుపై వస్తువులు ఉంచకూడదు. ముఖ్యంగా లోహపు వస్తువులు ఉంచకూడదు. - దుమ్ము, ధూళితో గీతలు
సాధారణంగా కారుపై దుమ్ము, ధూళి పడుతుంటాయి. ధూళి ద్వారా ఇసుకరేణువులు కారుపై చేరతాయి. ఇలాంటి సమయంలో మనం కారుపై చేతులు వేయడం, కవర్లు, లేదా ఇతర వస్తువులు పెట్టడం వల్ల ఇసుక రేణువులతో రాపిడి జరిగి, కారు పెయింటింగ్ దెబ్బతింటుంది. అంటే దుమ్ము, ధూళి వల్ల కూడా కారుపై గీతలు పడే అవకాశం ఉందని యజమానులు గమనించాలి. - కారును శుభ్రపరిచేటప్పుడు
మనం కారును సాధారణంగా నీళ్లతో కడుగుతుంటాం. అయితే చాలా మంది కారు కడిగిన తరువాత, తమకు దొరికిన ఏదో ఒక క్లాత్‌తో దానిని తడిచేస్తుంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. గరుకైన వస్త్రంతో కానీ, వీల్స్ తుడిచే గుడ్డతోగానీ కారును తుడిస్తే, వాహనంపై గీతలు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కారు పెయింటింగ్ ఎంతో మృదువుగా ఉంటుంది. అందుకే కారు తుడిచేందుకు మైక్రో ఫైబర్ క్లాత్ వాడాలి. అలాకాకుండా గరుకుగా ఉన్న క్లాత్ వాడితే, కారుపై గీతలు పడే అవకాశం ఉంటుంది. - కారుపై చేరబడకూడదు
చాలామంది కారుపై చేరబడుతుంటారు. ఇలా చేయడం వల్ల కారుకు ఏవిధమైన నష్టం లేదనుకుంటారు. కానీ, కారుపై చేరబడటం వల్ల కూడా పెయింటింగ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొంతమంది జీన్స్ వేసుకుంటారు. మరికొందరు రఫ్‌గా ఉండే వస్త్రాలు ధరిస్తారు. ఈ రకమైన దుస్తులు వేసుకుని కారుపై చేరబడితే వాహనంపై ఉండే దుమ్ముతో రాపిడి జరిగి కారుపై గీతలు పడతాయి. అంతేకాకుండా జీన్స్ బ్యాక్ పాకెట్‌కు ఉండే గుండీల వల్ల కూడా కారుపై గీతలు పడే అవకాశం ఉంటుంది. - చక్రాలను తుడిచే క్లాత్ వాడద్దు!
ఇంకొందరు కారును శుభ్రం చేసేటప్పుడు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కారు చక్రాలను తుడిచే వస్త్రంతోనే, కారు బాడీని కూడా తుడుస్తుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. చక్రాలకు ఉండే మట్టిలో ఎన్నో సూక్ష్మమైన రాళ్లు ఉంటాయి. టైర్లను కడిగే సమయంలో ఆ రాళ్లు క్లాత్‌లోకి చేరతాయి. అదేక్లాత్‌తో కారు బాడీని శుభ్రం చేస్తే, కచ్చితంగా గీతలు పడతాయి. - కారుపై కవర్ కప్పాల్సిందే - కానీ
దుమ్ము, ధూళి, ఎండ, వానల నుంచి రక్షణ కోసం చాలా మంది కార్లపై కవర్ కప్పుతుంటారు. ఇలా చేయడం వల్ల కూడా గీతలు పడేందుకు అవకాశం ఉంటుంది. కవర్ కప్పేసమయంలోనూ, తీసే సమయంలోనూ కారు పెయింగ్‌పై ఉండే దుమ్ముతో రాపిడి జరుగుతుంది. అలాగే కవర్‌కు ఉండే కఠినమైన స్వభావం వల్ల కూడా కారుపై గీతలు పడే అవకాశం ఉంటుంది. వాస్తవానికి కారు పెయింటింగ్ పాడైతే దాని విలువ ఎంతో తగ్గిపోతుంది. అందువల్ల కారుపై కవర్ వేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. లేకుంటే తరువాత మీరే ఇబ్బందిపడతారు. కనుక పైన చెప్పిన టిప్స్ అన్నీ పాటించి, మీ కారు పెయింటింగ్ పోకుండా చూసుకోండి.