తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ కాలేజ్ డ్రాపౌట్స్ 'కోటీశ్వరులు' అయ్యారు - ఎలాగో తెలుసా? - College Dropouts Billionaires - COLLEGE DROPOUTS BILLIONAIRES

College Dropouts Billionaires : వాళ్లంతా కాలేజ్ డ్రాపౌట్స్! అయితేనేం అపర కుబేరులుగా ఎదిగారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించారు. ఎంతో మందికి స్ఫూర్తిప్రదాతలుగా మారారు. మరి ఈ డ్రాపౌట్ బిలియనీర్స్‌‌ సక్సెస్ ఫార్ములా మనమూ తెలుసుకుందామా?

College Dropouts Billionaires
college dropouts who are now billionaires (Getty Images/ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 5:26 PM IST

College Dropouts Billionaires :మనం ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు. అలా చేస్తే, తప్పులో కాలేసినట్టు అవుతుంది. ఎందుకంటే, ఇవాళ మనం తక్కువగా అంచనా వేస్తున్న వాళ్లే, రేపు మనల్ని మించి ఎదిగినా ఆశ్చర్యం ఉండదు. చెప్పలేం, ఎప్పుడు ఏదైనా జరగొచ్చు!! కొంతమంది కాలేజ్ డ్రాపౌట్స్ సాధించిన అసాధారణ విజయాల గురించి తెలుసుకుంటే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. వీళ్లా ఈ విజయం సాధించింది? అని మీరు తప్పకుండా ప్రశ్నించి తీరుతారు. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే? ప్రస్తుతం ప్రపంచంలో బిలియనీర్లుగా వెలుగొందుతున్న వారిలో నాలుగో వంతు మంది కాలేజ్ డ్రాపౌట్సే కావడం గమనార్హం. అలాంటి వారిలోని టాప్​-6 బిలియనీర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అజీమ్ ప్రేమ్‌జీ : విప్రో కంపెనీ అధినేత అజీమ్ ప్రేమ్‌జీ తన 21 సంవత్సరాల వయస్సులో ఉండగా, అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివేవారు. అయితే తమ కుటుంబానికి చెందిన వంటనూనెల వ్యాపారాన్ని నడపడానికి ఆయన చదువును మధ్యలో ఆపేశారు. తదుపరి తమ కుటుంబ వ్యాపారాన్ని సాఫ్ట్‌వేర్‌, ఐటీ అవుట్‌ సోర్సింగ్ సేవల్లోకి విస్తరించారు. 50 సంవత్సరాల వయస్సులో అజీమ్ ప్రేమ్‌జీ డిగ్రీని పూర్తి చేయడానికి మళ్లీ స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీకి వెళ్లారు. ఇప్పుడు భారత్‌కు చెందిన అత్యంత ధనికుల్లో ఆయన కూడా ఉన్నారు. ఫోర్బ్స్​ ప్రకారం, భారతదేశానికి చెందిన బిలియనీర్​ అజీమ్ ప్రేమ్​జీ 12.1 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు.

గౌతమ్ అదానీ : గత పదేళ్లలో గౌతమ్ అదానీ సంపద అమాంతం పెరిగింది. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఆయన ఎదిగారు. నేపథ్యంలోకి వెళితే, గుజరాత్ యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగా గౌతమ్ అదానీ సడెన్‌గా చదువును మానేశారు. ఆ సమయంలో ఆయన ముంబయికి చేరుకొని వజ్రాల వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. చివరికి తన సొంత కంపెనీని స్థాపించారు. ప్రస్తుతం అదానీ గ్రూప్‌నకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యాపార గ్రూప్ పరిధిలో బొగ్గు గనులు, చమురు-గ్యాస్ అన్వేషణ, పోర్టులు, లాజిస్టిక్స్, విద్యుత్ ఉత్పత్తి, గ్యాస్ పంపిణీ సహా బోలెడు వ్యాపారాలు ఉన్నాయి. ఫోర్బ్స్​ ప్రకారం, భారతదేశానికి చెందిన బిలియనీర్​ గౌతమ్ అదానీ 57.1 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు.

బిల్ గేట్స్ : బిల్ గేట్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు. ఈయన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సును డిస్​కంటిన్యూ చేశారు. తన సొంత కంపెనీ ఏర్పాటుపై ఫోకస్ పెట్టారు. ఆయన శ్రమ, క్రియేటివిటీ, మార్కెట్ నైపుణ్యం ఫలించి మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్‌వేర్ జగత్తులో రారాజుగా ఎదిగింది. చాలా ఏళ్లపాటు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగిన ఏకైక వ్యక్తి బిల్ గేట్స్ మాత్రమే. ఫోర్బ్స్​ ప్రకారం, బిల్​గేట్స్ 135.3 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా బిల్ గేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

మార్క్ జుకర్‌బర్గ్ :ఫేస్‌బుక్ గురించి తెలియనివారు ప్రపంచంలో ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ కంపెనీని మార్క్ జుకర్‌బర్గ్ స్థాపించారు. ఈయన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగా డిస్​కంటిన్యూ చేశారు. తన సొంత సోషల్ మీడియా యాప్‌ను తయారు చేయడానికి కాలేజీ మానేశారు. ఆ ప్రయత్నం ఫలించింది. ఫేస్​బుక్ ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయింది. వాట్సాప్‌ను కూడా ఈయన కొనేశారు. ఇన్‌స్టాగ్రామ్ యాప్ కూడా ఈయనదే. ఫోర్బ్స్​ ప్రకారం, మార్క్​ జుకర్​బర్గ్​ 174.9 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. కంపెనీ స్టాక్స్‌లో దాదాపు 13 శాతం వాటా జుకర్ బర్గ్ వద్దే ఉంది.

జాక్ డోర్సీ :జాక్ డోర్సీ ట్విట్టర్ వ్యవస్థాపకుడు. పేమెంట్స్ కంపెనీ 'స్క్వేర్' వ్యవస్థాపకుల్లో ఈయన కూడా ఒకరు. ఈయన కాలేజీ డ్రాపౌట్. తొలుత మిస్సౌరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆయన చేరారు. అనంతరం అక్కడి నుంచి న్యూయార్క్ యూనివర్సిటీకి మారిపోయారు. ఈ వర్సిటీలో చదువుతుండగానే ఆయన డ్రాపౌట్ అయ్యారు. ట్విట్టర్‌ను డెవలప్ చేయడానికి తన గ్రాడ్యుయేషన్ చదువును డోర్సీ మధ్యలోనే (1997) వదిలేశారు. 2021 వరకు ఆయన ట్విట్టర్‌లోనే ఉన్నారు. అనంతరం దాన్ని ఎలాన్​ మస్క్ కొనేశారు. దీనితో డోర్సీ ట్విట్టర్ నుంచి వైదొలిగారు. ఫోర్బ్స్​ ప్రకారం, జాక్ డోర్సీ​ 4.3 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు.

స్టీవెన్ స్పీల్‌బర్గ్ : స్టీవెన్ స్పీల్‌బర్గ్ - ప్రపంచ ప్రఖ్యాత డ్రీమ్‌వర్క్స్ స్టూడియోస్‌ ఈయనదే. స్టీవెన్ చదువులో అంతగా రాణించలేదు. కాలేజీలో చాలా సాధారణ గ్రేడ్స్ వచ్చేవి. దీంతో ఉన్నత విద్య కోసం ఆయన కాలేజీలకు అప్లై చేసినా, వరుసగా మూడుసార్లు అడ్మిషన్ దొరకలేదు. ఎట్టకేలకు ఆయనకు ఒక కాలేజీలో అడ్మిషన్ దొరికింది. అయితే అదే టైంలో స్టీవెన్‌కు యూనివర్సల్ స్టూడియోలో జాబ్ వచ్చింది. దీంతో కాలేజీలో చేరలేదు. యూనివర్సల్ స్టూడియోలో జాబ్ చేసి పనిని నేర్చుకున్న అనంతరం, 1994 సంవత్సరంలో ఆయన సొంతంగా డ్రీమ్ వర్క్స్ స్టూడియోను స్థాపించారు. ఫోర్బ్స్​ ప్రకారం, స్టీవెన్ స్పీల్​బర్గ్​​ 4.8 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు.

చదువులు మధ్యలో ఆపేసినా, ఏమాత్రం భయపడకుండా, తమ కలల కోసం, వీరంతా నిరంతర కృషితో, కార్యదీక్షతో, ఎంతో కష్టపడి పనిచేశారు. ఫలితంగా తమ జీవిత లక్ష్యాలను సాధించగలిగారు. ఇదే వీరి సక్సెస్ ఫార్ములా.

చాణక్యుడు చెప్పిన ఈ 'బిజినెస్​ స్ట్రాటజీ' పాటిస్తే - విజయం మీ వెంటే! - Chanakya Arthashastra

బాగా ధనవంతులు కావాలని ఆశపడుతున్నారా? ఈ 'సక్సెస్ ఫార్ములా' మీ కోసమే! - How To Become Rich

ABOUT THE AUTHOR

...view details