Citibank Credit Card Migration Details : సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డులు వాడే వాళ్లంతా అలర్ట్ కావాలి. ఎందుకంటే జులై 15వ తేదీకల్లా సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డులన్నీ యాక్సిస్ బ్యాంకు పరిధిలోకి మారుతాయి. ఈ మైగ్రేషన్ జరిగిన తర్వాత సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డుల స్థానంలో యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులను జారీ చేసే ప్రక్రియ మొదలవుతుంది. అందరికీ ఈ కార్డుల రీప్లేస్‌మెంట్ జరగడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అప్పటివరకు సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డులనే ఎంచక్కా వాడొచ్చు. ఈ తరుణంలో సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించే వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలున్నాయి.
మైగ్రేషన్ తర్వాత యాక్సిస్ బ్యాంకు కస్టమర్ ఐడీని ఎలా పొందాలి ?
ఒకవేళ మీకు ఇప్పటికే యాక్సిస్ బ్యాంకు అకౌంటు ఉండి ఉంటే ప్రాసెస్ చాలా సులభం. మీ దగ్గరున్న యాక్సిస్ బ్యాంకు కస్టమర్ ఐడీకి సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు సమాచారం మైగ్రేట్ అవుతుంది. ఒకవేళ మీకు యాక్సిస్ బ్యాంకు అకౌంటు లేకుంటే మీ కోసం కొత్త యాక్సిస్ బ్యాంకు కస్టమర్ ఐడీని క్రియేట్ చేస్తారు. దానికి మీ సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు సమాచారాన్ని బదిలీ చేస్తారు. ఇది జరగడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. ఈ ప్రాసెస్‌కు సంబంధించిన సమాచారాన్ని బ్యాంకు మీకు ఎస్ఎంఎస్, ఈమెయిల్‌కు సందేశాల ద్వారా పంపుతుంది.
లావాదేవీలపై ప్రభావం ఉంటుందా ?
ఒక వ్యక్తికి ఇప్పటికే సిటీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు నుంచి చెరో క్రెడిట్ కార్డు ఉంటే, జులై 15 నుంచి లెక్క మారుతుంది. ఈ రెండు క్రెడిట్ కార్డులను కలిపి ఎంత క్రెడిట్ లిమిట్ ఇవ్వాలనేది యాక్సిస్ బ్యాంకు నిర్ణయిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉన్నవారికి ప్రాబ్లమ్ ఉండదు. వారికి మునుపటి కార్డు కంటిన్యూ అవుతుంది. సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు నుంచి వచ్చే లిమిట్‌తో దీన్ని కలపరు. ఎందుకంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా క్రెడిట్ కార్డు పొందడం అనేది సెక్యూర్డ్ లోన్ లాంటిది.
మైగ్రేషన్ తర్వాత సిటీ క్రెడిట్ కార్డును ఎలా యాక్సెస్ చేయాలి?
సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు యాక్సిస్ బ్యాంకుకు మైగ్రేట్ అయ్యాక కూడా మీరు మీ కార్డును సిటీ బ్యాంక్ ఆన్‌లైన్ ఖాతా, సిటీ మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. యాక్సిస్ బ్యాంకు అకౌంటు ఉన్నవారైతే వారికి కస్టమర్ ఐడీ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అయి సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు వివరాలను చూసుకోవచ్చు. లావాదేవీలు చేసుకోవచ్చు.